తెలంగాణ భవన్ లో కరీంనగర్‌కు చెందిన బీజేపీ నేత, వైద్యుడు ఎడవల్లి విజేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువా కప్పి విజేందర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు అమలుకు సాధ్యంకాని హామీలు ఇస్తుందంటూ దుయ్యబుట్టారు.
తెలంగాణ భవన్ లో కరీంనగర్‌కు చెందిన బీజేపీ నేత, వైద్యుడు ఎడవల్లి విజేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువా కప్పి విజేందర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తున్న హామీలు చూస్తుంటే చక్కెర వచ్చేలా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీలు నెరవేరాలంటే దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని అన్నారు. భవిష్యత్ లో మహిళలకు తులం బంగారం ఇస్తామన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం పెళ్లికాని యువకులకు పెళ్లిళ్లు చేస్తామని హామీ ఇస్తారంటూ ఎద్దేవా చేశారు. అవసరమైతే పిల్లలకు డైపర్స్ కూడా మారుస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇస్తారని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ హామీలు ఉత్త హామీలనే ఉత్తమ్ కుమార్ మాటలు ఉత్తరకుమార ప్రగల్భాలు తప్ప ఏమీ కాదని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ తిలోదకాలకు నీళ్లొదిలిందని కేటీఆర్ ఆరోపించారు. నైతిక విలువలకు తిలోదకాలిస్తూ అన్ని పార్టీలతో అపవిత్రమైన పొత్తులు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకే టీడీపీని స్థాపించినట్లు దివంగత సీఎం ఎన్టీఆర్ 1982లోనే చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి పట్టుకుని శని అన్నారని తెలిపారు. అలాంటి పార్టీలోకి చంద్రబాబు నాయుడు వచ్చి సొంతమామకు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారన్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు వల్ల ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీని తోకపార్టీగా చేర్చినప్పుడే మరోసారి ఆయన ఆత్మ క్షోభిస్తోందని అన్నారు. ఏ కాంగ్రెస్ పార్టీని అయితే ఖతం చేస్తానన్నారో అదే పార్టీతో పొత్తుపెట్టుకుని దేహి అంటూ అడుక్కునే స్థాయికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయారంటూ ధ్వజమెత్తారు. గతంలో పదవికోసం ఎన్టీఆర్ ను మెుదటిసారి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిస్తే ఇప్పుడు తెలంగాణ ప్రజలను వంచించడానికి రెండోసారి వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు.
కోదండరామ్ కొత్త పార్టీ స్థాపించడం సంతోషకరమన్న కేటీఆర్ మూడు సీట్ల కోసం మహాకూటమికి పొర్లుదండాలు పెడుతున్నారని విమర్శించారు. కోదండరామ్ మహాకూటమితో పొత్తుపెట్టుకోవడం వల్ల ఆయన స్థాయి దిగజారిందని తెలిపారు.
మహాకూటమితో ఎందుకు పొత్తుపెట్టుకుంటున్నారో కోదండరామ్ తెలంగాణ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మహాకూటమి కాదు అని తెలంగాణ ద్రోహి కూటమి అంటూ మండిపడ్డారు. ఏ ప్రాతిపదికన మహాకూటమితో పొత్తుపెట్టుకుంటున్నారో స్పష్టం చెయ్యాలన్నారు. ఏ అమరుడు చెబితే మహాకూటమితో పొత్తుపెట్టుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు.
విభజన చట్టంలోని హామీలను కేంద్రప్రభుత్వం నెరవేర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. హైకోర్టు విభజన ప్రక్రియను ప్రారంభించిన పాపాన పోలేదన్నారు. తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు పర్యటిస్తారు కానీ హామీలపై మాత్రం మాట్లాడరన్నారు.
