స్టేషన్ ఘనపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఐటీ మంత్రి కేటీఆర్  కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే 40 మంది సీఎం  అభ్యర్థులున్నారని...వారిలో ఎవరు సీఎం అవుతారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. చిన్న పిల్లల మ్యూజికల్ ఛైర్ ఆట మాదిరిగా కుర్చీ కోసం కాంగ్రెస్ నాయకులు వెంపర్లాడుతున్నారన్నారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ డిల్లీ నుండి సీల్టు కవర్ ద్వారానే  సీఎంను నియమిస్తారు తప్ప ఇక్కడివారి నిర్ణయాలకు విలువే ఉండదన్నారు. టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కేసీఆరే సీఎంగా ఉంటారని ప్రకటించిన కేటీఆర్...ఇలా సీఎం అభ్యర్థిని ప్రకటించే దమ్ముందా అంటూ కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. 

ఓ తెలంగాన కవి తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారని గుర్తు చేసిన కేటీఆర్.... దాన్ని కోటి ఎకరాల మాగాణంగా మార్చింది మాత్రం కేసీఆరే అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరికి సంక్షేయ, అభివృద్ది పథకాలను చేరేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా వున్న నియోజకవర్గాల్లో అభివృద్ది పనులు చేపట్టినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. 

స్వాతంత్య్ర భారతంలో రైతులకు అండగా నిలిచిన ఏకైక సీఎంగా కేసీఆర్ నిలిచారన్నారు. చరిత్రలో నిలిచే పనులెన్నో కేసీఆర్ చేశారని తెలిపారు.  71ఏళ్లలో దేశంలో ఎవరూ చేయని విధంగా కేసీఆర్ రైతుల రుణాలు మాపీ చేశారని ప్రశంసించారు. అలాగే ఇప్పటికే రైతు బంధు రూపంలో ఏడాదికి 8 వేలు ఇస్తున్నారని....మళ్లీ అధికారంలో వస్తే 10 వేలు ఇస్తామని మేనిపెస్టోలో పెట్టినట్లు పేర్కొన్నారు. 

ఆసరా పెన్షన్లను  రూ.1000, రూ.1500లకు పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇప్పుడు మళ్లీ దాన్ని పెంచుతామని కేసీఆర్ హామీ  ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ రూ.10,000 ఇచ్చినా ఓటేయమని పించన్లు అందుకుంటున్న వృద్దులు చెబుతున్నారని కేటీఆర్ వివరించారు. ఇలా  పెన్షన్లను పెంచి వృద్దులు ఆత్మగౌరవాన్ని కేసీఆర్ పెంచారన్నారు.  

కాంగ్రెస్ పార్టీ ఓ మహాసముద్రం అని కేటీఆర్ అన్నారు. అందులో ఎవరు ఉంటారో తేలీదు....ఎవరు బైటికి పోతారో తెలీదని ఎద్దేవా చేశారు. బషిర్ బాగ్, ముదిగొండలో రైతులను కాల్చి చంపిన రాబందులు టిడిపి, కాంగ్రెస్ పార్టీలయితే రైతుబంధుగా పేరు తెచ్చుకున్న నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ ప్రశంసించారు.