హైదరాబాద్: ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్లపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రగతి నివేదన సభ విజయవంతం అయ్యిందో కాలేదో ప్రజలకు తెలుసునన్నారు. కేసీఆర్ ప్రసంగంలో పసలేదు అంటున్న కాంగ్రెస్ నేతలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ లాంటి నేతలను తిడితే ప్రసంగం బాగుంది అనేవారేమో అంటూ చమత్కరించారు. 

51 నెలల కాలంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చెయ్యబోతుంది అన్నదానిపై స్పష్టత ఇచ్చేందుకే సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభ నిర్వహించారని కేటీఆర్ గుర్తు చేశారు.

ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ నేతలు పోటీపడి మరీ విమర్శించారన్నారు. కేసీఆర్ ను తిడితే రాహుల్ గాంధీ టిక్కెట్లు ఇస్తారనో ఏమో కానీ ఒకరి తర్వాత ఒకరు విమర్శించారన్నారు.  నాలుగున్నరేళ్లలో కేసీఆర్ ఏం చెయ్యలేదంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు మరి అన్ని ఉపఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కు ఎందుకు పట్టం కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కడుతున్నారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ గెలుపును కాంగ్రెస్ అడ్డుకోలేకపోయిందన్నారు.  

మరోవైపు హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు పట్టు ఏమీ లేదని కాంగ్రెస్ నేతలు వామపక్ష నేతలు ప్రగల్భాలు పలికారని అయితే తాను 100 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశానన్నారు. టీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తే చెవి కోసుకుంటానన్న సీపీఐ నారాయణ చెవి కోసుకున్నారో లేదో ఆయనకే తెలియాలన్నారు. ఒంటి చెవితో తిరుగుతున్నారో రెండు చెవులతో తిరగుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. 

అటు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. షబ్బీర్ అలీ నియోజకవర్గం అయిన కామారెడ్డి నుంచి భారీగా కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లోకి క్యూకడుతున్నారని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో షబ్బీర్ అలీ తన నియోజకవర్గంలో తానే జెండాలు కట్టుకోవాల్సిన దుస్థితి వస్తుందన్నారు.  

ఇకపోతే తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనను చూసి టీఆర్ఎస్ భయపడి ప్రగతి నివేదన సభ నిర్వహించిందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను కేటీఆర్ కొట్టిపారేశారు. 
రాహుల్ గాంధీకి దేశంలో ఎవరైనా భయపడతారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమేథీలో రాహుల్ గాంధీ గెలుస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితన్నారు. 

అఖిలేష్ యాదవ్ మద్దతు లేకపోతే ఆమెథీలో రాహుల్ గాంధీ ఓడిపోతారన్నారు. బలమైన నేత బరిలోకి దిగితే రాహుల్ గాంధీ పని అంతేనన్నారు. సొంత మున్సిపాలిటీలో గెలిపించుకోలేని రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా అంటూ ఎద్దేవా చేశారు.  

టీఆర్ఎస్ ను గద్దె దించేవరకు గెడ్డం తియ్యనని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. గెడ్డం తియ్యకపోతే తమకు ఒరిగేది ఏమీ లేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పీఠం కోసం 12 మంది పోటీపడుతున్నారన్నారు. డీకే అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ ఇలా 12 మంది ముఖ్యమంత్రులుగా పోటీపడుతూ ఎప్పుడు కేసీఆర్ ను గద్దె దించి సీఎం కుర్చీలో కుర్చుందామా అని ఎదురుచూస్తున్నారన్నారు. 

43లక్షల ఫించన్లు అమలు, ..రైతు రుణమాఫీ.. ఉచిత విద్యుత్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకా కేసీఆర్ ను గద్దె దించాలని కాంగ్రెస్ నేతలను కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారంలో ఉంటుందని ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భయపెట్టారని కానీ  అది తప్పని రుజువు చేశామన్నారు. 24 గంటలు విద్యుత్ ను అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ దేనన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం అంధకారం అయ్యిందే కానీ తెలంగాణ మాత్రం వెలుగులోనే ఉందన్నారు కేటీఆర్.