బీజేపీ నేత నుపుర్ శర్మను ఆ పార్టీ సస్పెండ్ చేయడంపై స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పైనా చర్యలు తీసుకోవాలని ఆయన జేపీ నడ్డాను కోరారు.
మహ్మద్ ప్రవక్తపై (mohammad pravakta) అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పార్టీ నేత నుపుర్ శర్మపై (nupur sharma) బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) ట్విట్టర్ ద్వారా స్పందించారు. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తే.. మసీదులు తవ్వాలన్న బండి సంజయ్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఉర్దూ బ్యాన్ చేయాలన్న సంజయ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన నిలదీశారు. ఒక్కోక్కరికీ ఒక్కో రకం ట్రీట్‌మెంట్ ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు.
కాగా.. ఇటీవల కరీంనగర్‌లో (karimnagar) జరిగిన హిందూ ఏక్తా యాత్రలో (hindu ekta yatra) తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మసీదులు తవ్వి చూద్దామంటూ ఎంఐఎం (aimim) అధినేత అసదుద్దీన్ ఒవైసీకి (asaduddin owaisi) సవాల్ విసిరారు. శవం వస్తే మీది.. శివ లింగం వస్తే మాది అంటూ వ్యాఖ్యానించారు.
లవ్ జిహాదీ మత మార్పిడులను చూస్తూ ఊరుకోమన్న బండి సంజయ్ .. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉర్దూను నిషేధిస్తామని సంచలన ప్రకటన చేశారు. అలాగే తెలంగాణలో మదర్సాలను శాశ్వతంగా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మదర్సాలను ఉగ్రవాద శిక్షణా కేంద్రాలుగా మార్చారని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌లో తనను మూడు సార్లు చంపాలని చూశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఫైల్స్‌లా తెలుగు రాష్ట్రాల్లో రజాకార్ ఫైల్స్ చూపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు.. గత వారం ఓ టీవీ డిబేట్‌లో నుపుర్ శర్మ మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్తను అగౌరవపరిచే వ్యాఖ్యలు చేశారు. దీంతో ముస్లిం గ్రూపులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. అదే వివాదం రగులుతుండగా నవీన్ కుమార్ జిందాల్ ట్విట్టర్‌లో ప్రవక్త గురించి ఓ ట్వీట్ చేశారు. ఇది కూడా తీవ్ర వ్యతిరేకతను తెచ్చింది. దీంతో ఆయన ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. కానీ, వీరి చర్యలపై ముస్లిం సమాజం తీవ్ర ఆగ్రహానికి లోనై ఆందోళనలకు దిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా, బీజేపీ కఠిన నిర్ణయం తీసుకుంది.
నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో కాన్పూర్‌లోని ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా పరేడ్ మార్కెట్‌లో షాపులను బంద్ చేశారు. ఈ క్రమంలోనే అక్కడ అల్లర్లు జరిగాయి. ఇందులో సుమారు 20 మంది పోలీసు సిబ్బంది సహా మొత్తం 40 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి సుమారు 1,500 మందిపై కేసు నమోదైనట్టు యూపీ పోలీసులు తెలిపారు.
