హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో 17స్థానాలు టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా టీఆర్ఎస్ ప్రభంజనమే కనిపిస్తుందని కేవలం బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనన్నారు.

అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు ఓడిపోతారని వారి పేర్లు సైతం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. అలాగే  కొడంగల్‌లో రేవంత్ రెడ్డి, మధిరలో భట్టి విక్రమార్క ఓడిపోవడం ఖాయమన్నారు. 

ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి డ్రామాలు మొదలు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. కొడంగల్‌లో గెలవలేక ఎన్నికలు వాయిదా పడేలా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మహిళలు, ముస్లీంలు ఒన్ సైడ్ టీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలిపారు. 

సెటిలర్లంతా టీఆర్ఎస్ వైపే ఉన్నట్లు చెప్పారు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమన్నారు. కాంగ్రెస్ లో కేసీఆర్ స్థాయి నేత లేడన్నారు. చివరి రోజు 5న ఎవరి నియోజకవర్గాల్లో వారే ప్రచారం చేస్తారని కేటీఆర్ చెప్పారు. ఈ సారి తన సొంతనియోజకవర్గమైన సిరిసిల్లలో 50 వేల మెజారిటీ దాటుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌‌లో తాను కూడా తిరుగుతానని చెప్పుకొచ్చారు. అక్కడ రాజకీయాల్లో కచ్చితంగా వేలు పెడతామని మరోసారి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే స్థానాలను బట్టి ఏపీలో మా వ్యూహం ఉంటుందన్నారు. 

అంతటితో ఆగని కేటీఆర్ తెలంగాణలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంపై స్పందిస్తూ ఆయన ఎంత తాపత్రాయపడ్డా ప్రయోజనం ఉండదని జోస్యం చెప్పుకొచ్చారు. ఆయన ఆశిస్తున్న అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురుతుందన్నారు.