మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌ ఖండించారు. తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన ఆ ఇద్దరు నేతలపై అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలు అనుచితమన్నారు.

ఒకరు ప్రధానిగా, మరొకరు సీఎంగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలకు చోటులేదని మంత్రి ట్వీట్ చేశారు. 

కాగా, అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం.. దమ్ముంటే హుస్సేన్‌సాగర్‌పై ఉన్న స్మారకాలను కూల్చివేయాలంటూ  అక్బరుద్దీన్‌ వ్యాఖ్యానించారు. గతంలో 4,700 ఎకరాలున్న హుస్సేన్ సాగర్ ప్రస్తుతం 700 ఎకరాలు కూడా లేదని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఇప్పుడు ఇస్తామని మాయమాటలు చెబుతోందని ఆరోపించారు. అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలో తమకు బాగా తెలుసని టీఆర్ఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.