గులాబీ పార్టీ ఏ పార్టీకి గులాంగిరి చేయదు.. ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ ఫైర్
KTR: తాను సీఎం కావాలంటే ఎవరి సపోర్టు అవసరంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే..గులాబీ పార్టీ ఎవరికి గులాంగిరి చేయదనీ, ఏ పార్టీకి బీ పార్టీగా ఉండదని స్పష్టం చేశారు.
KTR: తెలంగాణలో ప్రధాని మోడీ వరుస పర్యటనలో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఇందూర్ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను గులాబీ దళం తిప్పికొడుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ మరోసారి ప్రధాని వ్యాఖ్యలపై విరుచకపడ్డారు. నిర్మల్ జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పలు పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ గాలి మోటార్ లో వచ్చి గాలి మాటలు చెప్పారని మంత్రి మండిపడ్డారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై లేనిపోని ఆరోపణలు, పచ్చి అబ్బదాలు చెప్పారనీ, బీజేపీ తన అసత్య ప్రచారంతో ప్రజలను పక్కదోవ పట్టించాలని భావిస్తోందని ఆరోపించారు. ప్రధాని చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని, తాను ముఖ్యమంత్రి కావాలంటే.. రాష్ట్ర ప్రజలు తన వెంటనే ఉంటే చాలనీ, ఇతర పార్టీల నేతల సపోర్ట్ తన అవసరం లేదని తెలిపారు.
అయినా తని ముఖ్యమంత్రి చేయడానికి ప్రధాని మోదీ మద్దతు ఎన్వోసీ ఎందుకని ప్రశ్నించారు. తమ గులాబీ పార్టీ ఎవరికి గులాంగిరి చేయదని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కు పెరుగుతున్న క్రేజ్ చూసి, ఈ రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని అందుకే కావాలని తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకి బీ పార్టీ కాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ రంగంలో చూసిన అభివృద్ధి కనిపిస్తుందని, ప్రధాని మోడీ ఎన్నికలలో చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలేనని, ఇప్పటివరకూ జన్ ధన్ ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదని విమర్శించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతుబంధు ద్వారా వేలాది మంది ఆర్థిక సాయం అందించిందని, పేదల రైతులకు రుణమాఫీ చేసిందని తెలిపారు.
తెలంగాణలో వ్యవసాయ రంగంలో ముందంజలో ఉందనీ, సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో రైతులు నీళ్లు లేక, కరెంటు లేక దిక్కుతోచని స్థితిలో ఉండేవారని, కానీ, ప్రస్తుత ప్రభుత్వం రైతులకు సాగునీరు, తాగునీరు ఉచిత విద్యుత్ ఇస్తూ ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.