తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లాయర్ వామన్ రావు దంపతుల హత్యలపై స్పందించారు మంత్రి కేటీఆర్. మంగళవారం లాయర్‌లో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. కొంతమంది కిరాతకులు న్యాయవాద దంపతుల్ని దారుణంగా  చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

నడిరోడ్డుపైన ఇద్దరిని చంపినపప్పుడు అంతా బాధపడ్డామని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా వుంటున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

తమను పచ్చి బూతులు తిట్టేవారినే క్షమిస్తున్నామని.. కానీ హత్యల వెనుక టీఆర్ఎస్ పెద్దలున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల మీద మాకేం పగ ఉంటుందని కేటీఆర్ ప్రశ్నించారు.

Also Read:వామన్‌రావు దంపతుల హత్య: సుందిళ్ల బ్యారేజీ నుండి కత్తులు స్వాధీనం

హత్య వెనుక ఉన్నది మా పార్టీ వారని తేలితే వెంటనే సస్పెండ్ చేశామని మంత్రి తెలిపారు. శాంతిభద్రతల విషయంలో కేసీఆర్ ఎవరినీ ఏనాడు ఉపేక్షించలేదని కేటీఆర్ గుర్తుచేశారు.

రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లు ముందుకు సాగకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నో కేసులు వేసిందని ఆయన దుయ్యబట్టారు. అడ్వకేట్ ప్రొటక్షన్ యాక్ట్ కావాలని న్యాయవాదులు అడుగుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు.