రాజన్న సిరిసిల్ల: చేనేత కార్మికులను ఇకపై చేనేత కళాకారులు అనాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పద్మశాలి వస్త్ర పరిశ్రమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు కేటీఆర్ హాజరయ్యారు. 

పద్మశాలీల అభిమానాన్ని జీవితాంతం మరిచిపోలేనని కేటీఆర్ తెలిపారు. నేతన్నలు గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాలను మొరపెట్టుకున్న ఎవరూ కరుణించలేదని తమ ప్రభుత్వం మాత్రం అక్కున చేర్చుకుందని గుర్తు చేశారు. ఒకప్పుడు నేతన్నల ఆత్మహత్యలు పాటలుగా పాడుకునే దుస్థితిని అనుభవించామని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

అలాంటి పరిస్థితిని రూపుమాపేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. నేతన్నలను సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని తెలిపారు.నేతన్నల కోసం ఎంతో చేశామని కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు మారుతుండేవి, అత్యవసరమరమైనవి వస్త్రాలేనని చెప్పుకొచ్చారు. ప్రపంచ వస్త్ర వ్యాపారంలో దేశం ఎంతో వెనుకబడిందన్న కేటీఆర్ వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ ఉపాధి కల్పించే రంగం చేనేతరంగమేనని చెప్పారు. 

దేశవ్యాప్తంగా కోట్లాది మంది పద్మశాలీలు ఉన్నారన్న కేటీఆర్ ఎలాంటి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ లేకుండానే అద్భుతమైన వస్త్రాలు తయారు చేసే నైపుణ్యం నేతన్నలదని కొనియాడారు.