ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ముచ్చింతల్‌లో సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ నిమిత్తం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండటంపై మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ముచ్చింతల్‌లోని రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న మోదీ.. సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే మోదీ పర్యటను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీకి కనీసం స్వాగతం పలకకుండా.. కేసీఆర్ ప్రోటోకాల్ ఉల్లంఘించారనే విమర్శలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే గతంలో హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌ సందర్శనకు మోదీ వచ్చిన సమయంలో కూడా కేసీఆర్ కనిపించలేదు. 

ఈ రెండు సందర్భాల్లో ప్రధాని మోదీ పర్యటనల్లో కేసీఆర్ హాజరుకాకపోవడంపై.. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంచలన విషయాలను వెల్లడించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ స్పందిస్తూ.. ఆ రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రిని రావద్దని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టమైన సందేశం పంపిందని చెప్పారు. ఇది పీఎంవో ప్రోటోకాల్ ఉల్లంఘించినట్టు కాదా అని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి వల్ల ఓ ముఖ్యమంత్రికి జరిగిన అవమానం కాదా అని ప్రశ్నించారు. 

అదే ఇంటర్వ్యూలో గవర్నర్ జిల్లాల పర్యటనలో ప్రోటకాల్ ఉల్లంఘనలపై కూడా కేటీఆర్ సమాధానమిచ్చారు. ‘‘గవర్నర్ బీజేపీ నాయకురాలిలా వ్యవహరిస్తారు. మంత్రివర్గం ఆమోదించని ప్రసంగాన్ని ఆమె రిపబ్లిక్ డే రోజున చదివారు. అంతేకాకుండా ఆమె రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని చెప్పారు. 

కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని మంత్రి కూడా.. తెలంగాణ ముఖ్యమంత్రిని, మంత్రులు అవమానించారని కేటీఆర్ చెప్పారు. తాము వరి సేకరణ వంటి ముఖ్యమైన సమస్యలను లేవనెత్తినప్పుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎగతాళి చేశారని తెలిపారు. తమది అభివృద్ది సాధిస్తున్న రాష్ట్రమని.. అయితే దానిని అంగీకరించడానికి వారు నిరాకరిస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 

ఇక, ప్రధాని మోదీ సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో.. కేసీఆర్ గైర్హాజరు కావడంతో ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనకు స్వాగతం పలికారు. అలాగే వెళ్లేటప్పుడు వీడ్కోలు కూడా చెప్పారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా తెలంగాణతో రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్ గా పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మేడారం వెళ్లిన సమయంలో, యాద్రాద్రికి వెళ్లిన సమయంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన తమిళిసై.. వీటిపై ప్రధాన మంత్రి మోదీకి, హోం మంత్రి అమిత్ షాలకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.