మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కూడా ప్రచారంలో వేగం పెంచింది.

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కూడా ప్రచారంలో వేగం పెంచింది. మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు మునుగోడులో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ.. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్.. మునుగోడులో టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని యువతను కోరారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. లక్షలాది యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషిచేస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు యువత అండగా ఉండాలని పేర్కొన్నారు.

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో 2019లోనే నెలకొల్పింది టీఅర్ఎస్ ప్రభుత్వం. సుమారు 35 వేలమంది స్థానిక యువతకు ఉపాధిని అందించే ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పార్కు కూడా వస్తోంది. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా శరవేగంగా నిర్మాణం అవుతోంది. 

Scroll to load tweet…


ప్రభుత్వరంగంలో శరవేగంగా ఉద్యోగాల భర్తీ, గ్రామీణరంగంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పన చేస్తూ, మరోవైపు ప్రైవేటురంగంలో వేలాది పరిశ్రమల స్థాపన ద్వారా లక్షలాది యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషిచేస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు యువత అండగా నిలబడాలి’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే ఓ వీడియోతో పాటు.. కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. 

ఇక, మునుగోడు ఉప ఎన్నికను వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే మునుగోడులో ఎలాగైనా విజయం సాధించేందుకు పావులు కదుపుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు నిలవగా.. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. ఆరో తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.