మునుగోడు నియోజకవర్గంలోని అసమ్మతి నేతలు బుధవారం సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఎవరిని అభ్యర్ధిగా నిలబెట్టినా గెలిపించుకుంటామని చెప్పారు.
ఏ ఎన్నికనైనా టీఆర్ఎస్ పార్టీ సీరియస్‌గానే తీసుకుంటుందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలోని అసమ్మతి నేతలతో ఆయన భేటీ అయ్యారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ దగ్గరకు వెంటబెట్టుకెళ్లారు. అనంతరం ప్రగతి భవన్‌లో జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఎవరి స్వార్ధం కోసం మునుగోడు ఉపఎన్నిక జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.
చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్, చౌటుప్పల్ ఎంపీపీ, చౌటుప్పల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ , సింగిల్ విండో ఛైర్మన్, నారాయణ్ పూర్ మండల ఎంపీపీ, జడ్‌పీటీసీ, వైస్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, మనుగోడు మండల ఎంపీపీ, జడ్‌పీటీసీ, వైఎస్ చైర్మన్, చండూరు మున్సిపల్ ఛైర్మన్, జడ్‌పీటీసీ ఛైర్మన్, నాంపల్లి ఎంపీపీ, జడ్‌పీటీసీ తదితర మండల స్థాయి ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించామని జగదీశ్ రెడ్డి వెల్లడించారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
గడిచిన మూడున్నర సంవత్సరాలుగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో విఫలమయ్యారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అలాగే ప్రభుత్వ నిధుల్ని కూడా వినియోగించలేకపోయారని మంత్రి దుయ్యబట్టారు. 2018లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించుకోకపోవడం వల్లే నష్టపోయామనే భావన మునుగోడు ప్రజల్లో వుందన్నారు. కేసీఆర్ మనిషిని గెలిపించుకుని వుంటే తమకు సరైన అభివృద్ధి జరిగేదని ప్రజలు భావిస్తున్నారని మంత్రి తెలిపారు. మునుగోడు నియోజకవర్గ చరిత్రలో కేవలం 2018 నుంచి 2018 మధ్యకాలంలోనే అభివృద్ధి అనేది చూశామని ప్రజలు చెబుతున్నారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి తన స్వార్ధం కోసం ఉపఎన్నిక తీసుకొచ్చారని మంత్రి ఆరోపించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎవరిని ప్రకటించినా.. తామంతా ఐక్యంగా వుండి గెలిపిస్తామన్నారు.
ALso Read:Munugode bypoll 2022: కూసుకుంట్లకు అసమ్మతి సెగ, రంగంలోకి జగదీష్ రెడ్డి
ఇకపోతే.. టీఆర్ఎస్ నుంచి మునుగోడు టికెట్ ఆశిస్తున్న వారిలో ప్రధానంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ పేర్లు వినిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ నేతలు మంగళవారం సీఎంను కలిసి రెడ్డి లేదా బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని కోరినట్టుగా సమాచారం. అయితే టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ నిర్వహించిన వివిధ సర్వేల్లో ప్రజలు కూసుకుంట్ల వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. అలాగే అభిప్రాయ సేకరణలో కూడా ఆయన పేరు ప్రధానంగా వినిపించినట్టుగా టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్ రెడ్డి కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది.
ఇదే సమయంలో మునుగోడు నియోజకవర్గంలో అసమ్మతిపై దృష్టి పెట్టింది టీఆర్ఎస్. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అసమ్మతి నేతలతో సమావేశమయ్యారు మంత్రి జగదీశ్ రెడ్డి. జడ్‌పీటీసీ , ఎంపీటీసీ, సర్పంచ్‌లను పిలిపించుకున్నారు. విభేదాలను పక్కనపెట్టి, కలిసి పనిచేయాలని మంత్రి వారికి సూచించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఎట్టి పరిస్ధితుల్లోనూ టికెట్ ఇవ్వొద్దని కోరుతున్నారు అసమ్మతి నేతలు. ఆయనకు టికెట్ ఇస్తే.. ఎన్నికల్లో సహకరించబోమని ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ హైకమాండ్ అప్రమత్తమైంది.
