సూర్యాపేట:  కబడ్డీ పోటీల ప్రాంగంణంలో గ్యాలరీ కుప్పకూలిన ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.

సూర్యాపేట కబడ్డీ  పోటీలు జరిగే ప్రాంగంణంలో గ్యాలరీ కుప్పకూలిన ఘటనలో సుమారు వందమందికి పైగా గాయపడ్డారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని  మంత్రి  జగదీష్ రెడ్డి  సోమవారం నాడు రాత్రి పరామర్శించారు.

ఆసుపత్రిలో వైద్య సహాయం అందుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకొన్నారు.  బాధితుల ఆరోగ్య పరిస్థితులపై ఆయన వాకబు చేశారు.ఎవరూ కూడ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు.

ఇవాళ రాత్రి సూర్యాపేటలో 47వ జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభమైన కొద్దిసేపటికే  మూడో నెంబర్ గ్యాలరీ కుప్పకూలింది. దీంతో గ్యాలరీపై కూర్చొన్న వారు గాయపడ్డారు.గాయపడిన వారిని సూర్యాపేటతో పాటు నార్కట్ పల్లి, నల్గొండ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారిని  హైద్రాబాద్ కు తరలించారు.