మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్‌లోని అసమ్మతి వర్గం నేతలకు కేసీఆర్ క్లాస్ పీకారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గడం లేదు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదని శుక్రవారం వారు తీర్మానం చేశారు.  

మునుగోడు టీఆర్ఎస్‌లో అసమ్మతి ఎపిసోడ్‌ ఇంకా చల్లారలేదు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని ఒక వర్గం టీఆర్ఎస్ అధిష్టానానికి తెగేసి చెప్పింది. ఈ మేరకు శుక్రవారం చౌటుప్పల్‌లో పలువురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు భేటీ అయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి పలువురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ఆయన బుజ్జగిస్తున్నారు. 

కాగా... టిఆర్ఎస్ పార్టీ తరపున మునుగోడు బరిలో మాజి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దిగనున్నారు. సిఎం కేసిఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ నెల 20న సంస్దాన్ నారాయణ పూర్ లో జరుగనున్న ప్రజా దీవెన సభలో సిఎం కేసిఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం గురించి ప్రకటించనున్నారు. 

ఇకపోతే.. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలోని అసమ్మతి నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి రెండ్రోజుల క్రితం భేటీ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సీఎం కేసీఆర్ దగ్గరకు వెంటబెట్టుకెళ్లారు. అనంతరం ప్రగతి భవన్‌లో జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఎవరి స్వార్ధం కోసం మునుగోడు ఉపఎన్నిక జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. 

ALso Read:Munugode ByPoll : కేసీఆర్ క్లాస్, మునుగోడు టీఆర్ఎస్‌లో అసమ్మతికి చెక్.. కలిసి పనిచేస్తామంటోన్న నేతలు

చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్, చౌటుప్పల్ ఎంపీపీ, చౌటుప్పల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ , సింగిల్ విండో ఛైర్మన్, నారాయణ్ పూర్ మండల ఎంపీపీ, జడ్‌పీటీసీ, వైస్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, మనుగోడు మండల ఎంపీపీ, జడ్‌పీటీసీ, వైఎస్ చైర్మన్, చండూరు మున్సిపల్ ఛైర్మన్, జడ్‌పీటీసీ ఛైర్మన్, నాంపల్లి ఎంపీపీ, జడ్‌పీటీసీ తదితర మండల స్థాయి ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించామని జగదీశ్ రెడ్డి వెల్లడించారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 

గడిచిన మూడున్నర సంవత్సరాలుగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో విఫలమయ్యారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అలాగే ప్రభుత్వ నిధుల్ని కూడా వినియోగించలేకపోయారని మంత్రి దుయ్యబట్టారు. 2018లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించుకోకపోవడం వల్లే నష్టపోయామనే భావన మునుగోడు ప్రజల్లో వుందన్నారు. కేసీఆర్ మనిషిని గెలిపించుకుని వుంటే తమకు సరైన అభివృద్ధి జరిగేదని ప్రజలు భావిస్తున్నారని మంత్రి తెలిపారు. మునుగోడు నియోజకవర్గ చరిత్రలో కేవలం 2018 నుంచి 2018 మధ్యకాలంలోనే అభివృద్ధి అనేది చూశామని ప్రజలు చెబుతున్నారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి తన స్వార్ధం కోసం ఉపఎన్నిక తీసుకొచ్చారని మంత్రి ఆరోపించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎవరిని ప్రకటించినా.. తామంతా ఐక్యంగా వుండి గెలిపిస్తామన్నారు.