తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. పదవులు శాశ్వతం కాదని.. రాష్ట్రం శాశ్వతమని చురకలంటించారు. బీజేపీ నేతలు క్షుద్ర రాజకీయాలు చేయడం తగదని హరీశ్ రావు హితవు పలికారు.

రాష్ట్ర హక్కులకు భంగం కలిగేలా బండి సంజయ్‌ వ్యవహరిస్తున్నారని మంత్రి ఆరోపించారు. దేశభక్తి ప్రతీ పౌరుడికి ఉంటుందని... సంజయ్‌ స్వరాష్ట్ర భక్తి ఎక్కడకి పోయిందంటూ హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చేతనైతే ఓ జాతీయ ప్రాజెక్టు తెస్తే.. నిండు సభలో సన్మానం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు గురించి కొట్లాడింది తామేనని హరీశ్ రావు గుర్తుచేశారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని ఎదిరించి మంత్రి పదవులు త్యాగం చేసిన చరిత్ర కేసీఆర్‌దని హరీశ్ రావు వెల్లడించారు.

అన్ని అనుమతులు వచ్చాకే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్రానికి లేఖ రాయడం వెనుక అంతర్యం ఏంటో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

ఏపీ కడుతున్న అక్రమ నిర్మాణాలపై న్యాయపోరాటం చేస్తున్నామని.. సీఎం కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారని హరీశ్ రావు స్పష్టం చేశారు. దీనితో పాటు సుప్రీంకోర్టులో కూడా కేసు వేశామని.. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా చూస్తున్నామని మంత్రి వెల్లడించారు.