Asianet News TeluguAsianet News Telugu

కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థాయి ఏమిటో ఢిల్లీ దూతలు చెప్పేశారు.. మంత్రి హరీష్ రావు సెటైర్లు..

బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రస్టేషన్‌లో నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వారివి నకిలీ మాటలు, వెకిలి చేష్టలు అని ఎద్దేవా చేశారు

Minister Harish Rao Slams Kishan Reddy And Bandi Sanjay
Author
First Published Oct 31, 2022, 12:27 PM IST

బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రస్టేషన్‌లో నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వారివి నకిలీ మాటలు, వెకిలి చేష్టలు అని ఎద్దేవా చేశారు. వాళ్లు మాట్లాడేవన్నీ అసత్యాలేనని విమర్శించారు. అబద్దాలు అనేది బీజేపీ డీఎన్‌ఏగా మారిపోయిందని ఆరోపించారు. మునుగోడులో సీఎం కేసీఆర్ సభ తర్వాత బీజేపీ నేతలకు దిమ్మతిరిగి పోయిందని అన్నారు. బీజేపీ నాయకులు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గల్లీలో ఉండే నాయకులు కూడా ఈ విధంగా మాట్లాడరని అన్నారు. 

కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలు ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయేలా ఉన్నాయని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మాట్లాడేప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలో తెలియదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సభతో బీజేపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని అన్నారు. 8 ఏళ్లలో తాము ఏం చేశామో మునుగోడుకు వస్తే చూపిస్తామని చెప్పారు. మునుగోడులో నీటి సమస్యను తీర్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. అత్యధికంగా రైతు బంధు లబ్ది పొందిన నియోజకవర్గం మునుగోడు అని చెప్పారు. మునుగోడులో 95 శాతం మందికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తెలిపారు. 

కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థాయి ఏమిటో ఢిల్లీ నుంచి వచ్చిన దూతలు చెప్పారని హరీష్ రావు అన్నారు. రూ. 100 కోట్ల ఆశ చూపినా ఎమ్మెల్యేలు గడ్డిపోచలా చూశారని అన్నారు. 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన పడగొట్టి.. గద్దెనెక్కిన బీజేపీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తాము బీజేపీ మాదిరిగా దొడ్డిదారిన ప్రభుత్వాలను కూలగొట్టలేదని చెప్పారు. టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకున్నది కరెక్ట్ అయితే.. తాము కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విలీనం చేసుకుంటే తప్పవుతుందా? అని ప్రశ్నించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఫిర్యాదుపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు రాసిందని చెప్పారు. మీటర్లు పెడితేనే నిధులు ఇస్తామని చెప్పింది నిజం కాదా? అని అని ప్రశ్నించారు. మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదంటే కేంద్రం రూ. 30 వేల కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. దీనిపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చెబుతారని ప్రశ్నించారు. కృష్ణ జలాల పంపిణీకి సంబంధించి కేంద్రానికి ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటై ఎనిమిదేళ్లైనా కేంద్రం నీటి వాటాను తేల్చలేదని మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios