ఎన్నికలప్పుడు టెంట్లు వేసి స్టంట్లు.. కాంగ్రెస్‌వి దొంగ డిక్లరేషన్లు, నమ్మొద్దు : హరీశ్ రావు
జమిలి ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు . ఐదు రాష్ట్రాల్లో ఓటమి భయంతోనే మోడీ జమిలి ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడగానే టెంట్లు వేసి స్టంట్లు చేయడమే కాంగ్రెస్ పని అని హరీశ్ రావు చురకలంటించారు.

జమిలి ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు. బుధవారం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ..కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రోజుకొక మేనిఫెస్టోను, రోజుకొక డిక్లరేషన్‌ను ఇస్తోందని దుయ్యబట్టారు. 50 ఏళ్లలో ఆ పార్టీ ఏం చేయలేకపోయిందని.. కేసీఆర్ ఏం చెప్పారో అది చేసి చూపించారని హరీశ్ ప్రశంసించారు.
ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతుబంధు, రైతు బీమా ఇచ్చారని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ అబద్ధాలు కావాలో, కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలకు హరీశ్ పిలుపునిచ్చారు. తిట్లు కావాలంటే కాంగ్రెస్‌కు.. కిట్లు కావాలంటే కేసీఆర్‌కు ఓట్లు వేయాలని మంత్రి వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల్లో ఓటమి భయంతోనే మోడీ జమిలి ఎన్నికలకు వెళ్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు.
హుస్నాబాద్‌లో మూడోసారి కూడా సతీష్ కుమార్‌ను గెలిపించుకుందామన్నారు. ఇక్కడ తండాలు గ్రామ పంచాయతీలుగా, గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తవుతోందంటే కేసీఆర్ వల్లనేనని హరీశ్ రావు తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఓట్లు అడుగుతుందని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుందన్నారు . వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్యే పోటీ వుంటుందని హరీశ్ పేర్కొన్నారు . 2009లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటిలో ఏ ఒక్కటైనా అమలు చేసిందా అని మంత్రి ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గర పడగానే టెంట్లు వేసి స్టంట్లు చేయడమే కాంగ్రెస్ పని అని హరీశ్ రావు చురకలంటించారు.