ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్ఎస్ నేతలు, మంత్రులు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. రాహుల్ గాంధీపై పోటీ చేసిన తుషార్ గురించి తాము మాట్లాడామని మంత్రి హరీశ్ అన్నారు. గవర్నర్ మాత్రం తన దగ్గర పనిచేసిన తుషార్ గురించి చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
వందల కోట్లు ఖర్చు పెట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ చూసిందన్నారు మంత్రి హరీశ్ రావు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లకు సంబంధం లేకపోతే సిట్ విచారణ ఆపాలని కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిజాలు బయటికి రావాలనే సిట్ వేశామని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో వ్యవహారంతో సంబంధం లేదని బండి సంజయ్ చెప్పారని ఆయన దుయ్యబట్టారు. విచారణ ఆపాలని బీజేపీ చూస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
బీజేపీకి సంబంధం లేకపోతే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కోర్టుకు ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేరాన్ని అంగీకరించి క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని... రాహుల్ గాంధీపై పోటీ చేసిన తుషార్ గురించి తాము మాట్లాడామని మంత్రి అన్నారు. కానీ గవర్నర్ తన దగ్గర పనిచేసిన తుషార్ గురించి మాట్లాడారని హరీశ్ ఫైర్ అయ్యారు. దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించడం తప్పా అని మంత్రి ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై గవర్నర్ ఎందుకు మాట్లాడారో అర్ధం కావడం లేదని హరీశ్ అన్నారు.
ALso REad:నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారేమో... ఫాంహౌస్ కేసులో రాజ్‌భవన్‌ను లాగాలనే : తమిళిసై సంచలన వ్యాఖ్యలు
బీజేపీ నేతలు అడ్డంగా దొరికిపోయి.. రోజుకొక నాటకం ఆడుతున్నారని.. వాళ్ల పరిస్థితి తేలుకుట్టిన దొంగల్లా వుందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సంబంధం లేదని తడి బట్టలతో దేవుడి దగ్గరికి వెళ్లారని హరీశ్ సెటైర్లు వేశారు. నిజంగా మీరు నిర్దోషులే అయితే విచారణకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇంకోసారి ఇలాంటి పనిచేయమని లెంపలేసుకోవడం తప్ప బీజేపీకి వేరే మార్గం లేదన్నారు హరీశ్. తెలంగాణ ప్రజల మీద బీజేపీకి కుట్రపూరిత వైఖరి అన్న ఆయన .. అన్ని విషయాలు బయటకు వస్తాయని న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు.
ఇకపోతే.. ఫామ్‌హౌస్ కేసులోనూ రాజ్‌భవన్‌ను లాగాలని చూశారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదముద్ర వేయడంలో జాప్యంపై ఆమె వివరణ ఇచ్చారు. బుధవారం ఆమె రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తుషార్ గతంలో ఏడీసీగా పనిచేశారని తెలిపారు. తుషార్ పేరు ఉద్దేశ్యపూర్వకంగా తీసుకొచ్చారని తమిళిసై ఆరోపించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు అనుమానాలున్నాయని గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్ కేసులో తొలుత తుషార్.. తర్వాత రాజ్‌భవన్ పేరును ప్రస్తావించారని తమిళిసై అన్నారు. ఏడీసీగా పనిచేసినంత మాత్రానికే రాజ్‌భవన్ పేరును కేసులోకి లాగుతారా అని ఆమె ప్రశ్నించారు.
