Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌ను రా.. నన్ను ఓరేయ్, బీజేపీలో చేరాక భాష మారింది: ఈటలపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

బీజేపీలో చేరాక ఈటల రాజేందర్ భాష మారిందని ఆక్షేపించారు మంత్రి హరీశ్ రావు. ఈటల గెలిస్తే ప్రజలు ఓడిపోతారని ఆయన అన్నారు. తనను ఎలా పిలిచినా తాను మాత్రం గౌరవంగా రాజేంద్ర అన్న అనే అంటానని హరీశ్ రావు పేర్కొన్నారు.

minister harish rao sensational comments on bjp leader etela rajender in huzurabad
Author
Huzurabad, First Published Aug 11, 2021, 4:27 PM IST

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై విరుచుకుపడ్డారు మంత్రి హరీశ్ రావు. హుజురాబాద్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈటలకు 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కేసీఆర్ అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్‌ను రా .. అని, నన్ను ఓరేయ్ హరీశ్ రావు అని ఈటల అంటున్నారంటూ మంత్రి మండిపడ్డారు. బీజేపీలో చేరాక ఈటల భాష మారిందని.. రాజేందర్ గెలిస్తే ప్రజలు ఓడిపోతారని హరీశ్ రావు స్పష్టం చేశారు. తనను ఎలా పిలిచినా తాను మాత్రం గౌరవంగా రాజేంద్ర అన్న అనే అంటానని హరీశ్ రావు పేర్కొన్నారు.

పెంచిన తల్లిదండ్రుల గుండెలపైనే.. కొడుకు తన్నినట్లుగా ఈటల వ్యవహారం వుందని హరీశ్ రావు మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశారని ఈటలను మంత్రి ప్రశ్నించారు. రెండు గుంటలున్న గెల్లు శ్రీనుకు, 200 ఎకరాలున్న ఈటల మధ్య పోటీగా హుజురాబాద్ ఉప ఎన్నికకు హరీశ్ అభివర్ణించారు. ఎకరం అమ్ముతా.. ఎలక్షన్ గెలుస్తానని ఈటల అంటున్నారని మంత్రి ఎద్దేవా  చేశారు. ఈటల రైతు బంధు వద్దని రూ.10 లక్షలు ఎందుకు తీసుకున్నారని హరీశ్ ప్రశ్నించారు. నీ స్వార్థం కోసమే రాజీనామా చేశావని, సిద్ధాంతాలు గాలికి వదిలేశావని మంత్రి ఆరోపించారు. 

Also Read:మంత్రిగా ఈటల చేయలేని పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చేస్తాడా?: హరీశ్ రావు

కాగా, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ను టీఆర్ఎస్ బరిలోకి దింపనుంది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ బుధవారం నాడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఆ సమయంలో  అరెస్టై జైలుకు వెళ్లాడు. ఓయూ టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా కూడ ఆయన గతంలో పనిచేశాడు. ప్రస్తుతం టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నాడు.

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఆయన స్వగ్రామం ఉంది. దీంతో ఈ నియోజకవర్గం నుండి ఆయనను బరిలోకి దింపాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది.పార్టీ ఆవిర్భావం నుండి గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ లోనే ఉన్నారని కేసీఆర్ గుర్తు చేశారు.ఉద్యమకాలంలో అరెస్టై జైలుకు వెళ్లిన విషయాన్ని ఆయన ఓ ప్రకటనలో గుర్తు చేశారు. శ్రీనివాస్‌యాదవ్‌ది  క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వమని ఆయన చెప్పారు.
  

Follow Us:
Download App:
  • android
  • ios