Harish Rao: వారి బోగస్ మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దు : హరీష్ రావు
Harish Rao: తెలంగాణ ప్రజలపై బీజేపీ, కాంగ్రెస్‌లు వివక్షాపూరిత విధానాలు అవలంభిస్తున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణపై వివక్ష చూపడంలో కాంగ్రెస్ నంబర్ 1 అనీ, బీజేపీ నంబర్ 2 అని ఏద్దేవా చేశారు.

Harish Rao: తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్‌లు వివక్షాపూరిత విధానాలను అవలంభిస్తున్నాయని ఆరోపించిన ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు, తెలంగాణపై వివక్ష చూపడంలో కాంగ్రెస్ A 1, బీజేపీ A 2 నిందితులని పేర్కొన్నారు. బుధవారం తాండూరు నియోజకవర్గంలో రూ.50కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి పి.మహేందర్‌రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల పట్ల బీజేపీ, కాంగ్రెస్ లు వివక్షాపూరిత వైఖరిని అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. దేశం వెనుకబాటుకు రెండు పార్టీలే కారణమన్నారు. నేడు దేశ ప్రజలు తెలంగాణా మోడల్ అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ నేత బోగస్ మాటలు నమ్మి ప్రజలు ఆగం కావద్దని మంత్రి హరీష్ రావు సూచించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే కుట్ర జరుగుతోందనీ, ఈ క్రమంలో ప్రతిపక్షాలు కేసీఆర్ ప్రభుత్వంపై అబద్ద ప్రచారం చేస్తున్నాయని అన్నారు. కర్ణాటకలో కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు.పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న కేసీఆర్‌పై ప్రతిపక్షాలు అబద్ద ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఆ ప్రతిపక్షాల అబద్ధాలు తిప్పికొట్టాలంటే.. ప్రజలంతా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.
అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయనీ, రాజకీయ లబ్ధి కోసం అంగన్‌వాడీ కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రాజకీయ పార్టీల బారిన పడవద్దని హరీశ్‌రావు కోరారు. బీజేపీ లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎక్కువ జీతాలు చెల్లిస్తోంది. ప్రధాని మోదీ గుజరాత్‌లో కూడా అంగన్‌వాడీ వర్కర్లకు కేవలం రూ.6 వేల వేతనం చెల్లిస్తుండగా, తెలంగాణలో మాత్రం ప్రభుత్వం నెలకు రూ.13,500 చెల్లిస్తోందని అన్నారు.
త్వరలో పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ) ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచుతామని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల జీతాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందని చెప్పారు. ప్రధాని మోదీ అక్టోబర్ 1న రాష్ట్రానికి వచ్చనా తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ప్రధాని మోడీ ఎందుకు వస్తున్నారు? అని ప్రశ్నించారు. కేంద్రం ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందనీ, ఒక్క సెంట్రల్ స్కూల్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మంత్రి హరీశ్‌రావు.. తెలంగాణకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కేంద్రం ఎందుకు ఇవ్వలేదో కేంద్రమంత్రి చెప్పాలని అన్నారు.