తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు మంత్రి హరీశ్ రావు. గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ నాయకులు ప్రచారానికి వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చే నాయకులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇచ్చి ఇక్కడకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

ఛార్జ్ షీట్ అసలు వేయాల్సి వస్తే బీజేపీపై వెయ్యాలని..  ఐజీఎస్టీ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన  బకాయిలు ఇవ్వకుండా ఉన్నది బీజేపీయేనని మండిపడ్డారు. డిసెంబర్ 1వ తేదీన మీ ఛార్జ్ షీట్‌కు హైదరాబాద్ నగర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హరీశ్ వ్యాఖ్యానించారు.

బెంగుళూరు, గుజరాత్‌లలో వరదలు వస్తే  డబ్బులు ఇచ్చిన బీజేపీ హైదరాబాద్‌కు వరద సహాయం ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు. హైదరాబాద్ ప్రజల అవస్థలు మీకు పట్టదా అని ప్రశ్నిస్తున్నా?. మీకు హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.

హైదరాబాద్ ప్రజలపై బీజేపీకి ప్రేమ ఉంటే  ప్రజలకు వరద సహాయం కోసం నిధులు విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో వరదలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కారణమంటున్న  కేంద్ర మంత్రి జవదేకర్ ముంబై వరదలకు కారణమేవరో చెప్పాలన్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ మొన్నటికి మొన్న కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం భేష్ అని మెచ్చుకుంటే ఈరోజు హైదరాబాద్ వచ్చిన మరో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కరోనాను కట్టడి చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు.

బీజేపీ ఆఫీస్‌లో కుర్చీలు ఎగురుతున్నాయి, షర్టులు చిరుగుతున్నాయి.. మీ మధ్య మీకె సమన్వయం లేదు ఇక ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని ఆయన సెటైర్లు వేశారు.