కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరని.. బీజేపీకి క్యాడర్ లేరని సెటైర్లు వేశారు మంత్రి హరీశ్ రావు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్‌దేనని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.  అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా కాంగ్రెస్ అమ్మేస్తుందని హరీశ్ రావు దుయ్యబట్టారు.

కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. శనివారం మెదక్ లోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని తెలిపారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి మెదక్ జిల్లాలో పర్యటిస్తారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని హరీశ్ రావు వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరని.. బీజేపీకి క్యాడర్ లేరని ఆయన సెటైర్లు వేశారు. కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌ను తిట్టడంలో బిజీగా వుంటే.. కేసీఆర్ వడ్డు పండించడంలో బిజీగా వున్నారని హరీశ్ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే మెదక్ జిల్లా కల నెరవేరిందని.. 24 గంటల విద్యుత్ ఇచ్చి చూపించామని మంత్రి తెలిపారు. లక్ష లోపు రుణ ప్రకటన కారణంగా 30 లక్షల కుటుంబాలకు రుణమాఫీ జరిగిందని హరీశ్ రావు పేర్కొన్నారు. త్వరలో రూ.లక్షకు పైగా రుణమాఫీ చేస్తామని మంత్రి చెప్పారు.

ALso Read: దూకుడు పెంచిన కాంగ్రెస్, డిక్లరేషన్లపై ఫోకస్: సెప్టెంబర్ లో మేనిఫెస్టో విడుదల

బీఆర్ఎస్ పథకాలను చూసి కాంగ్రెస్ భయపడిపోతోందని.. కర్ణాటకలో ఆ పార్టీ పాలనను ప్రజలు గమనిస్తున్నారని హరీశ్ తెలిపారు. అభ్యర్ధుల నుంచి ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా కాంగ్రెస్ అమ్మేస్తుందని హరీశ్ రావు దుయ్యబట్టారు. ఎన్నికలు వుంటేనే కాంగ్రెస్ నాయకులు బయటికి వస్తారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్‌దేనని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.