బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 22వ ఫౌండేషన్ డే కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ట్రస్ట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్యపై హరీశ్ రావు ప్రశంసల వర్షం కురిపించారు.
సినీ, సేవా, రాజకీయ రంగాల్లో నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) అద్భుత ప్రగతి సాధిస్తున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (harish rao) ప్రశంసించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి (basavatarakam cancer hospital) 22వ ఫౌండేషన్ డే కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ట్రస్ట్ ఛైర్మన్ బాలకృష్ణ, సభ్యులు నామా నాగేశ్వర్ రావు సహా ఇతర సభ్యులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే (ntr) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (kcr) ఎంతో అభిమానమన్నారు. ఈ దారిలో కేసీఆర్ వెళ్తున్నప్పుడు క్యాన్సర్ ఆస్పత్రి, ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలు గుర్తుకు చేసుకునే వారని హరీశ్ రావు తెలిపారు. నైట్ షెల్టర్ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పగానే బాలకృష్ణ అమలు చేశారని.. అలాగే బాలకృష్ణ అడగ్గానే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ కింద రూ. 6 కోట్ల భారం పడకుండా కేసీఆర్ చేశారని హరీశ్ రావు వెల్లడించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని పని ఇది అని ఆయన గుర్తు చేశారు.
క్యాన్సర్ రోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 753 కోట్లు ఖర్చు చేసిందని హరీశ్‌రావు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా బసవతారకం ఆస్పత్రికి వెళ్లిందని మంత్రి తెలిపారు. ఈ 22 ఏళ్లలో 3 లక్షల మంది రోగులకు ఈ ఆస్పత్రి సేవలందించడం గొప్ప విషయమని హరీశ్ రావు ప్రశంసించారు. క్యాన్సర్‌ను గుర్తించడం పెద్ద సమస్య అని.. అందుకే తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో కీమోథెరపీ, రేడియో థెరపీ ప్రారంభించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం 300 పడకలున్న ఎంఎన్‌జే ఆస్పత్రిని 750 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. అటామనస్ సంస్థగా రూపొందించి, ఆస్పత్రి మరింత మెరుగుపడేలా చేస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలో 8 మాడ్యులార్, రోబోటిక్ థియేటర్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పాలియేటివ్ కేర్ సెంటర్లు 33 జిల్లాల్లో ఏర్పాటు చేశామని.. 33 ఆలనా వాహనాలు ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని.. మొదటి స్థానానికి చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని హరీశ్ రావు అన్నారు.
అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్ పేదలకు క్యాన్సర్ సేవలు చేరువ చేయాలని ఈ ఆసుపత్రి నిర్మించారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహా సభల్లో తెలంగాణ ప్రభుత్వం తనను గౌరవించిందని బాలయ్య గుర్తుచేసుకున్నారు. హరీశ్ రావు ప్రజల మనిషి అని... అందరికీ అందుబాటులో ఉండి, ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన ప్రశషించారు. హరీశ్‌రావు వర్క్ హాలిక్ అని అలాంటి వ్యక్తి ఇక్కడికి రావడం సంతోషకరమన్నారు. చిన్న వయసులోనే హరీశ్‌రావు ఎన్నో శిఖరాలు అదిరోహించారని బాలకృష్ణ ప్రశంసించారు. శాతకర్ణి సినిమా కోసం అడగగానే కేసీఆర్ పన్ను మినహాయింపు ఇచ్చారని ఆయన గుర్తుచేసుకున్నారు.
