దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో టీఆర్ఎస్ కార్యకర్త స్వామి కుటుంబ సభ్యులను మంత్రి హరీష్ రావు బుధవారం నాడు ఓదార్చారు. 

దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాత ఓటమి పాలై విషయం తెలుసుకొని టీఆర్ఎస్ కార్యకర్త స్వామి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ విషయం తెలుసుకొన్న మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డిలు బుధవారం నాడు స్వామి కుటుంబసభ్యులను పరామర్శించారు. స్వామి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

స్వామి పార్థీవదేహం ఉన్న పాడెను మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు మోశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. గెలుపు ఓటములు సహజమన్నారు. ఓటమి చెందామని ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని ఆయనన సూచించారు.

కార్యకర్తలు అందరూ సంయమనం తో ఉండాలి.సహనం కోల్పోవద్దని ఆయన కోరారు. ధైర్యం తో ముందుకు పోదామన్నారు. టి ఆర్ ఎస్ కార్యకర్త  స్వామి మరణ వార్త విని ఎంతో బాధపడ్డానని ఆయన చెప్పారు. 

పార్టీ కార్యకర్తలను అందరిని టీఆర్ఎస్  కాపాడుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. స్వామి చాలా చురుకైన కార్యకర్త అని ఆయన గుర్తు చేసుకొన్నారు. 
మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రచారం లో చురుకుగా పాల్గొన్నాడన్నారు.

స్వామి కుటుంబాన్ని టీఆరెస్ పార్టీ అన్ని విధాలుగా అదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. స్వామి కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. 

స్వామి పిల్లల చదువు కూడా రెసిడెన్షియల్ స్కూల్ లో తల్లి కోరుకున్న విధంగా చదివిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.