సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికల్లో బిజెపి తప్పుడు ప్రచారాలతో లబ్ధి పొందాలని చూస్తోందని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభత్వానికి సంక్షేమ పథకాల కోసం కేంద్రం భారీగా నిధులిస్తోందంటూ తప్పుడు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ది పొందాలని అనుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదని మంత్రి  హెచ్చరించారు. ఈ అసత్య ప్రచారాలపై చర్చకు సిద్దమా అంటూ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు హరీష్ సవాల్ విసిరారు.   

రాష్ట్ర ప్రభుత్వం అందించే వృద్ధాప్య‌, బీడీ కార్మికుల పెన్ష‌న్‌తో పాటు కేసీఆర్ కిట్‌పై బీజేపీ నాయ‌కులు అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. బీడీ కార్మికుల‌కు ఇచ్చే పెన్ష‌న్‌లో కేంద్రమే రూ.1600 ఇస్తుంద‌ని...రాష్ర్టం వాటా కేవలం రూ. 400 అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం 1600 కాదు 16 పైసలు కూడా ఇవ్వడం లేదన్నారు. 

ఒకవేళ కేంద్రమే ఒక్కో పెన్షనర్ కు రూ.1600 ఇస్తుందని నిరూపిస్తే తాను మంత్రి పదవికే కాదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. లేదంటే సంజయ్ దుబ్బాక పాత బస్టాండ్ వద్ద ప్రజలందరూ  చూస్తుండగా ముక్కు నేలకు రాస్తాడా? అని హరీష్ సవాల్ విసిరారు.