తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌ కార్యాక్రమాన్ని తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమా‌చార నివే‌దిక (హెల్త్‌ ప్రొఫైల్‌) సిద్ధం చేయనున్నారు.

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌ కార్యాక్రమాన్ని తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. తె‌లం‌గాణ హెల్త్‌ ప్రొఫైల్‌‌ను ముందుగా పైలట్‌ ప్రాజెక్టులుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ములుగు జిల్లా ఏరియా ఆస్పత్రిలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని శనివారం హరీష్ రావు ప్రారంభించారు. అలాగే జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్కలు పాల్గొన్నారు. ఇంకా.. రూ.31 లక్షలతో పిడియాట్రిక్స్ యూనిట్, రూ.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియాలజీ ల్యాబ్‌కు మంత్రులు శంకుస్థాపన చేశారు. 

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమా‌చార నివే‌దిక (హెల్త్‌ ప్రొఫైల్‌) సిద్ధం చేయనున్నారు. అనంతరం వారికి డిజిటల్ హెల్త్ కార్డులను అందజేయనున్నారు. హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హెల్త్ ప్రొఫైల్ ప్రతిష్టాత్మక కార్యక్రమం అని చెప్పారు. వైద్య సేవలు మరింత విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్టుగా చెప్పారు. 

ములుగులో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని 40 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఇందుకోసం 197 టీమ్స్‌ను ములుగు జిల్లాల్లో ఏర్పాటు చేశామని చెప్పారుఈ కార్యక్రమానికి రూ. 10 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. అన్ని పరీక్షలు నిర్వహించాక డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. వివరాలన్నీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అత్యవసర సమయంలో చికిత్స అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. 

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని హరీష్ రావు మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీకి కేంద్రం రూ. 20 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. గిరిజన యూనివర్సిటీలో గిరిజనులకు 90 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.