చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం.. : మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమని అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమని అన్నారు. ఈ వయసులో ఆయనను అరెస్ట్ చేయడం మంచిది కాదని చెప్పారు. ఒకప్పుడు ఐటీ అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిపై మంచి మాటలు చెప్పారని.. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో 100 ఎకరాలు తీసుకోవచ్చని చెప్పారని అన్నారు. కేసీఆర్ పాలన బాగుంది కాబట్టే చంద్రబాబు ఆ మాట అన్నారని చెప్పారు. కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేదా అని ప్రశ్నించారు.
అయితే కొద్దిరోజుల కిందట చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన హరీష్ రావు.. అసలు చంద్రబాబు అరెస్ట్‌తో తమకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఈ అరెస్ట్ ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతోన్న గొడవ అని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పుకొచ్చారు.
మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ జరుగుతోందని అన్నారు.చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఏపీకి సంబంధించినదని, తమకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై ధర్నాలు చేయాల్సింది అక్కడ.. కానీ హైదరాబాద్‌లో ర్యాలీలు తీస్తున్నారని అన్నారు. పక్కింట్లో పంచాయతీని ఇక్కడ తీర్చుకుంటారా అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా అని అన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకూడదనే ర్యాలీలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు ఏపీ రాజకీయాలు అంటించొద్దని అన్నారు.