అగ్నిపథ్‌ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనపై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆర్మీ ఉద్యోగాలకు అగ్నిపథ్ పేరుతో కేంద్రం మంగళం పాడుతోందని ఆరోపించారు.

అగ్నిపథ్‌ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనపై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆర్మీ ఉద్యోగాలకు అగ్నిపథ్ పేరుతో కేంద్రం మంగళం పాడుతోందని ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రూ.37 కోట్ల వ్యయంతో చేపట్టిన వంద పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో కలిసి హరీశ్‌ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. ఆర్మీని ప్రైవేట్‌పరం చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. కేంద్రం నిర్ణయంతో దేశంలో అగ్ని రాజుకుందని చెప్పారు.

అగ్నిపథ్‌ను మార్చాలని అడిగితే కాల్చి చంపుతున్నారని మండిపడ్డారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశంలో అగ్గి రాజుకుందన్నారు. ఆర్మీని ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. యువకుల బాధ కేంద్రానికి అర్థం కావడం లేదన్నారు. బండి సంజయ్, డీకే అరుణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దాడుల వెనక ఇక్కడ టీఆర్‌ఎస్‌ హస్తం ఉంటే మరి ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అల్లర్ల వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. బీజేపీ మాటలు తీయగా, చేతలు చేదుగా ఉన్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజావ్యవతిరేక నిర్ణయాలతో ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటున్ననది చెప్పారు.

ఇక, సికింద్రాబాద్ స్టేషన్ ఘటనపై రైల్వే పోలీసులు ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు స్టేషన్‌లోకి దాదాపు 300 మంది ఆందోళనకారులు ప్రవేశించినట్లు తెలిపారు. సాధారణ ప్యాసింజర్ల మాదిరిగా గేట్ నెం.3 నుంచి ఆందోళనకారులు వచ్చినట్లు వెల్లడించారు. స్టేషన్‌లోకి వచ్చీ రాగానే అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని... కర్రలు, రాడ్లతో ఆ వెంటనే 2 వేల మంది ఆందోళనకారులు స్టేషన్‌లోకి ప్రవేశించారని పోలీసులు పేర్కొన్నారు. రైళ్లపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారని.. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినట్లు తెలిపారు. 

రైల్వే ట్రాక్‌పై వున్న రాళ్లతో పోలీసులపై నిరసనకారులు దాడులు చేశారని.. మొత్తం 8 రైళ్లపై దాడులకు తెగబడ్డారని వెల్లడించారు. పోలీసు బలగాలు రాగానే ట్రాక్‌పైకి ఆందోళనకారులు పరుగులు తీశారని.. ఆ వెంటనే భద్రతా సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారని వారు తెలిపారు. రాళ్ల దాడిలో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మృతి చెందాడని.. మరో 12 మంది గాయపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైల్వే స్టేషన్‌లో రూ.20 కోట్లు ఆస్తినష్టం సంభించినట్లు ప్రకటించారు. 

ఈ ఘటనపై సికింద్రాబాద్ డీఆర్ఎం మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే పార్శిల్ ఆఫీస్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. పార్శిల్ ఆఫీసులో వున్న వస్తువులు ధ్వంసమయ్యాయని.. ఇప్పటి వరకు రూ.7 కోట్ల వరకు ఆస్తి నష్టమైందని డీఆర్ఎం తెలిపారు. పార్శిల్ కార్యాలయంలో వున్న వాహనాలు ధ్వంసమయ్యాయని.. చాలా వరకు ఇన్సూరెన్స్ వుందని, పరిశీలిస్తున్నామని డీఆర్ఎం పేర్కొన్నారు. పలు బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయని ఆయన చెప్పారు. చాలా బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయని.. ఐదు రైల్వే ఇంజిన్లను పూర్తిగా ధ్వంసం చేశారని డీఆర్ఎం వెల్లడించారు. సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని.. దీనిని తాత్కాలికంగా రిపేర్ చేశామని ఆయన పేర్కొన్నారు.