Harish Rao: 'తెలంగాణ పాలపిట్ట సీఎం కేసీఆర్'
Harish Rao: సీఎం కేసీఆర్ తెలంగాణకు పాలపిట్ట అని, దసరా పర్వదినాన పవిత్రమైన పాలపిట్ట సాక్షిగా ప్రమాణం చేసి రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.
Harish Rao: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దసరా పండగను ఘనంగా నిర్వహించుకున్నారు. సిద్దిపేటలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ పాలపిట్ట కేసీఆర్ కు అండగా నిలుద్దామనీ, కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదని అన్నారు. చెడుపై విజయం సాధించడమే విజయదశమి.. ఈ పర్వదినాన పవిత్రమైన పాలపిట్ట సాక్షిగా ప్రమాణం చేసి.. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని మంత్రి హరీష్ రావు కోరారు. దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని అన్నారు.
సిద్దిపేటకు ట్యాగ్ లైన్ అయిన జిల్లా ఏర్పాటు, గోదావరి జలాలు, రైలు తెచ్చుకున్నామన్నారు. దసరా నాటికి సిద్దిపేటకు రైలు తెస్తానని గత దసరా రోజు చెప్పా.. ఈ విజయదశమి లోపు సిద్దిపేటకు రైలు తెచ్చి దశాబ్దాల కల సాకారం చేసుకున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో సిద్దిపేట నుండి తిరుపతి బెంగళూరుకు రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. త్వరలోనే సిద్దిపేట వాసుల మరిన్ని కలలు నెరవేరుతాయని, మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతామన్నారు.
స్థానిక ప్రజల దీవెన, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేట.. రాష్ట్రంలోని ఎన్నో ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. దేవాలయాల, రిజర్వాయర్ ఖిల్లాగా సిద్దిపేటను మార్చుకున్నామని, వచ్చే బతుకమ్మ నాటికి సిద్దిపేట కోమటి చెరువు వద్ద ఆర్టిఫిషియల్ బీచ్, శిల్పారామం ప్రారంభించుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ప్రజల దీవెనలతో సిద్దిపేట ఆదర్శంగా నిలిచిందని అన్నారు.