కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీశ్ రావు కౌంటరిచ్చారు . కిషన్ రెడ్డితో చర్చకు కేసీఆర్ స్థాయి అవసరం లేదని.. తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి అంటూ చురకలు వేశారు.
అమరవీరుల గురించి మాట్లాడే నైతికత కిషన్ రెడ్డికి (kishan reddy) వుందా అని ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు (harish rao) . తెలంగాణ భవన్‌లో (telangana bhavan) మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారని హరీశ్ రావు గుర్తుచేశారు. కిషన్ రెడ్డితో చర్చకు కేసీఆర్ స్థాయి అవసరం లేదని.. తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి అంటూ చురకలు వేశారు. తెలంగాణ ప్రజలు మాట్లాడుకునే భాషనే కేసీఆర్ మాట్లాడతారని హరీశ్ రావు పేర్కొన్నారు. మీలాగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కేసీఆర్ మాట్లాడరని.. ఉపాధి హామీ పథకానికి కోత ఎందుకు పెట్టారని కేసీఆర్ అడిగితే తప్పా అని మంత్రి ప్రశ్నించారు.
ఎరువులకు బడ్జెట్‌లో 34 వేల కోట్లు తగ్గించిందని నిజమా, కాదా అని హరీశ్ రావు పేర్కొన్నారు. పేదలను కొట్టి గద్దలకు పెట్టే పార్టీ బీజేపీ అంటూ దుయ్యబట్టారు. కేంద్రమంత్రిగా వున్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు వరదలు వస్తే రూ.10 అయినా తీసుకొచ్చారా అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా రాకపోతే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడరని కిషన్ రెడ్డిని నిలదీశారు. సమ్మక్క- సారలమ్మ జాతరకు తాము 364 కోట్లు కేటాయిస్తే.. మీరు 2.5 కోట్లే ఇచ్చారని హరీశ్ రావు మండిపడ్డారు. నదుల అనుసంధానం పేరుతో తెలంగాణ నీళ్లను కర్ణాటక, తమిళనాడుకు తీసుకెళ్తారా అని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు మా ప్రాజెక్ట్‌లకు క్లియరెన్స్ ఇవ్వకుండా నదుల అనుసంధానం అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
అంతకుముందు ఏడేండ్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పనితీరుపై బహిరంగ చర్చకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం సవాల్ విసిరారు. కేసీఆర్ ఆరోపణల నేపథ్యంలో బహిరంగ చర్చకు సిద్దమంటూ కిషన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడేండ్ల పాలనలో మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న కేసీఆర్ ఆరోపణపై మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఈ కాలంలో ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని, ఈ విషయాన్ని చర్చలో నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
అలాగే, ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం కేసీఆర్ అభ్యంతరకర పదజాలంతో దూషిస్తున్నారనీ, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధినేత నిరాశతో ప్రధానిపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. కేసీఆర్ వాడుతున్న భాష ముఖ్యమంత్రికి తగదని అన్నారు. బీజేపీని దేశం నుంచి తరిమికొడతామని కేసీఆర్ చెప్పడంపై.. భూమ్మీద ఏ శక్తీ దీన్ని చేయలేదని బీజేపీ కిషన్ రెడ్డి అన్నారు. రేపు అధికారం కోల్పోయినా బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా కొనసాగుతుందని తెలిపారు.
2016లో ఉరీ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ రుజువు కావాలంటూ కేసీఆర్ చేసిన ప్రకటనను కేంద్ర మంత్రి ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు దేశ భద్రత, సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని కిషన్ రెడ్డి అన్నారు. "అతను అమరవీరులను అవమానించాడు, మన ధైర్య సైన్యాన్ని నిరుత్సాహపరిచాడు. అత్యున్నత త్యాగం చేసిన వారి కుటుంబాల మనోభావాలను దెబ్బతీశాడు" అని కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఉపయోగిస్తున్న భాషను పాకిస్థాన్ కూడా ఉపయోగించదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
