మెదక్‌ : తమ పంచాయితీ ఆంధ్ర ప్రజలతో కాదని తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నించే వలసాంధ్ర నాయకత్వంపైనేనని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మెదక్‌లో పర్యటించిన హరీష్ కాంగ్రెస్‌ నాయకులు ఏపీ సీఎం చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. 

తెలంగాణ ప్రజలపై తెలంగాణ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలన్న హరీష్ టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఎవరి కనుసన్నుల్లో పనిచేస్తున్నాడో తెలుసు కదా అన్నారు. అమరావతి వెళ్లనిదే ఎల్ రమణ నిర్ణయాలు తీసుకునేలా ఉన్నాడా అంటూ ప్రశ్నించారు. ఎపి భవన్‌లో చంద్రబాబు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి  చేతులు కట్టుకుని నిలబడటాన్నితెలంగాణ ప్రజలు సహించలేరన్నారు.  

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన టీడీపీ కాంగ్రెస్ తో కలిసి ఢిల్లీకి తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తోందని హరీష్ మండిపడ్డారు. బానిస మనస్తత్వంతో కాంగ్రెస్ చంద్రబాబు పల్లకీ మోసేందుకు రెడీ అవుతుందని ధ్వజమెత్తారు. 

టీడీపీ, కాంగ్రెస్ లకు తెలంగాణ ఏపీలలో వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరుల లేఖలను త్వరలో బయటపెడతామన్నారు. ఆ లేఖల్లో చంద్రబాబుపై అమరులు ఏం రాశారో ప్రజలకు వివరిస్తామని హరీష్ తెలిపారు.  

ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు రూపాయి ఇవ్వనంటే కాంగ్రెస్ నాయకులు ఒక్కరూ మాట్లాడలేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే అభివృద్ధి పరంపర కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలే టీఆర్ఎస్ మేనిఫెస్టో అని స్పష్టం చేశారు.

టీడీపీది రెండు కళ్ల సిద్ధాంతమైతే, కాంగ్రెస్ ది కన్నుకొట్టే సిద్దాంతమని టీఆర్ఎస్ పార్టీది మాత్రం కంటికి రెప్పలా కాపాడుకునే సిద్ధాంతం అంటూ హరీష్ చెప్పుకొచ్చారు. అన్నింటిని వద్దు అంటున్న కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు వద్దనుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో రైతు కడుపు ఎండిందని అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు కడుపు నిండిందని చెప్పారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను వద్దంటున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ జలయజ్ఞం పేరుతో పదేళ్లలో 5 లక్షల ఎకరాలకు నీరందిస్తే నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం 12 లక్షల ఎకరాలకు నీరందించిందని తెలిపారు. 

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలను గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని హరీష్ రావు ప్రజలను కోరారు.