తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్,  ఎంపీ వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి)‌లు నేడు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. 

తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి)‌లు నేడు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో గంగుల కమలాకర్, గాయత్రి రవిలు నోటీసులు అందజేసిన సీబీఐ.. ఈ రోజు విచారణకు రావాల్సిందిగా తెలిపింది. ఈ క్రమంలోనే గంగుల కమలాకర్, గాయత్రి రవిలు నేడు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇక, సీబీఐ అధికారిగా నటించి ప్రజలను మోసం చేశారనే ఆరోపణలపై విశాఖపట్నంలోని చిన్న వాల్తేర్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తిని న్యూఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో అధికారులు మూడు రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

అయితే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కాపు సమ్మేళన సమావేశంలో శ్రీనివాస్.. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ గాయత్రి రవిలను కలిసినట్టుగా ఉన్న ఫొటోలను సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వారికి నోటీసులు జారీ చేశారు. దీంతో వారిద్దరు నేడు విచారణకు హాజరయ్యారు. వారి వెంట లాయర్లను కూడా తీసుకుని వెళ్లారు. అయితే శ్రీనివాసులతో పరిచయంపై ప్రశ్నించనున్న అధికారులు.. వారి వాంగ్మూలం నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, బుధవారం మంత్రి గంగుల ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు.. ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు అందజేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఈ నోటీసులు అందజేశారు. అయితే తనకు వచ్చిన నోటీసులపై కమలాకర్ స్పందిస్తూ.. సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్న శ్రీనివాస్ గెట్ టుగెదర్‌లో తనను కలిశారని చెప్పారు. తాను సీబీఐ ఎదుట హాజరవుతానని, విచారణకు సహకరిస్తానని చెప్పారు.