హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి వివాదంపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సీరియస్ అయ్యారు. గాంధీ వ్యవహారాలపై సమగ్ర నివేదిక కోరామని, నివేదిక రాగానే తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. వ్యక్తుల కన్నా వ్యవస్థ ముఖ్యమని ఆయన శనివారం మీడియాతో అన్నారు. 

అలక్ష్యాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. ఆరోగ్య శాఖ చాలా పెద్దదని, అప్పుడప్పుడు అక్కడక్కడ ఏదో సంఘటన జరుగుతుంటుందని, జరుగుతున్న 99 శాతం మంచిని పట్టించుకోకుండా 1 శాతం తప్పులను ఎత్తి చూపడం మంచిది కాదని ఆయన అన్నారు. అక్రమాలు జరిగితే చూస్తూ ఊరుకోబోమని ఆయన అన్నారు. 

ఎక్కడ పద్ధతికి వ్యతిరేకంగా వ్యవహరించినా, ప్రజలకు ఇబ్బంది కలిగించిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. గాంధీ ఆస్పత్రి వ్యవహారాలపై డాక్టర్ వసంత్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో తీవ్ర వివాదం చోటు చేసుకుంది. 

హౌస్ సర్జనులు పూర్తి కాలం ఇంటర్న్ చేయకుండా సర్టిఫికెట్లు పొందుతున్నిారని, ముడుపులు చెల్లించి అలా సర్టిఫికెట్లు పొందుతున్నారని ఆయన ఆరోపించారు. సానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయని, సగం మందే పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ఈ ఆరోపణల నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఆరోగ్య శాఖ అధికారులతో, ఇతర అధికారులతో ఈటెల రాజేందర్ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఆయనకు డీఎంఈ రమేష్ నుంచి ప్రాథమిక నివేదిక అందినట్లు తెలుస్తోంది.