కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ లో కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేస్తున్న భారత్ బంద్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారం ఉంది కానీ చట్టాలతో రైతుల కళ్ళలో కొట్టే అధికారం లేదని అన్నారు. ఢిల్లీ లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం రైతులు చేసే ధర్నాకు దేశం లో ప్రతి వ్యక్తి అండగా ఉండాలన్నారు. 

కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఎఫ్ సి ఐ, సిసిఐలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయని, దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలు అన్నింటినీ ప్రైవేటు సంస్థలకు అమ్మే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. 

బి జె పి పాలిత రాష్ట్రాల్లో ఎంఎస్ పి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు.