సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజ్ పార్క్‌లో ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ కంపెనీ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్‌కి మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. పశమైలారం ప్రాంతంలో నీళ్లే విషమయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో మార్పు వచ్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు అభివృద్ధి అంటే గుజరాత్, మహారాష్ట్ర కానీ ఇప్పుడు తెలంగాణ గుర్తొస్తోందని ఈటల తెలిపారు.

దేశంలో 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తోంది తెలంగాణయేనన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా 15 రోజుల్లో పారిశ్రామిక అనుమతులు ఇస్తున్నామని రాజేందర్ గుర్తు చేశారు. ఇక్కడ అతి తక్కువ ధరకే నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉందని ఈటల పేర్కొన్నారు.

ప్రస్తుతం పేదలు వైద్య ఖర్చులను భరించే స్థితిలో లేరని.. అందుకే వైద్య పరికరాలు తక్కువ ధరకు అందించాలని అబ్ధుల్ కలాం కలలు కన్నారని ఈటల స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 20 ఎకరాల్లో 250 కోట్ల వ్యయంతో ఈ కంపెనీని ఇక్కడ నెలకొల్పడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. 22 కంపెనీలకి ఈ ప్రాంతంలో స్థలం కేటాయించామని.. తద్వారా 4 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు.

డయాలసిస్ పరికరాలు, ఇన్సులిన్ తయారీ పరిశ్రమ, బాండెడ్ కంపెనీ ఈ ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయిని జయేశ్ తెలిపారు. 18 మంది మహిళా పారిశ్రామిక వేత్తల కోసం భూమిని కేటాయించామన్నారు. 

"