ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఆదివారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రచారం చేసి కొన్ని పార్టీలు కార్మికులను రెచ్చగొడుతున్నారని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్టీసీకి కేసీఆర్ రూ.3.303 కోట్ల సహకారం అందించారని.. సంస్ధను బాగు చేయడానికి సీఎం అన్ని విధాలుగా సహకరించారని దయాకర్ రావు గుర్తు చేశారు.

అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీసి ప్రభుత్వంలో విలీనం చేశారా అని బీజేపీ నేతలను మంత్రి ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే కాషాయ నేతలు డ్రామాలు వేస్తున్నారని వాటిని కట్టిపెట్టాలని ఎర్రబెల్లి హితవు పలికారు.

గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నించాయని దయాకర్ రావు గుర్తు చేశారు.

ఆ ప్రాజెక్ట్‌కు కేంద్రం నుంచి నిధులు రాకుండా బీజేపీ... కోర్టుల్లో కేసులు వేస్తూ కాంగ్రెస్ ఎన్నో కుట్రలు చేశాయని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ప్రజలు ఘోరంగా ఓడించారని మంత్రి దుయ్యబట్టారు.