బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు. అబద్ధాలు కాదు నిజాలు చెప్పడం నేర్చుకోవాలంటూ చురకలు వేశారు. తెలంగాణ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్న బండి సంజయ్‌ను ఏమనాలంటూ ఫైర్ అయ్యారు.
బీజేపీ (bjp) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై (bandi sanjay) మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao) . మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పడం మానుకోవాలని, వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా (mahabubnagar district ) ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, పాదయాత్ర చేస్తూ ప్రజలకు బండి సంజయ్ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే చెబుతోందని గుర్తుచేశారు.
కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం ఎలా కొనసాగుతుందో, తెలంగాణలో ఎలా కొనసాగుతుందో చర్చించేందుకు తమ వద్దకు రావాలని బండి సంజయ్‌కు మంత్రి సవాలు విసిరారు. ఉపాధి హామీ నిధులు మూడు నెలల నుంచి ఇవ్వట్లేదని అంటున్నారని, లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వమే నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తుందని ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్న బండి సంజయ్‌ను ఏమనాలని ఆయన దయాకర్ రావు నిలదీశారు.
మరోవైపు.. కేంద్రంపై ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్ (ktr) సోమవారం విమర్శలు చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుందని కేటీఆర్, టీఆర్ఎస్ నాయకులు గతకొలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పిన కేటీఆర్.. వీటన్నింటికి మోదీ సర్కారే కారణమని ఫైర్ అయ్యారు. బీజేపీ పాలనలో ఆక్సిజన్ దగ్గర నుంచి బొగ్గు వరకు అన్నీ కొరతేనని ఆరోపించారు. బీజేపీ పాలనలో బొగ్గు కొరత.. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత.. పరిశ్రమలకు కరెంట్ కొరత.. యువతకు ఉద్యోగాల కొరత.. గ్రామాల్లో ఉపాధి కొరత.. రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత.. ఉన్నాయన్నారు. అయితే అన్ని సమస్యలకు మూలం పీఎం మోదీకి విజన్ కొరతేనని కేటీఆర్ విమర్శించారు. గత కొంతకాలంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిని.. ఎన్‌పీఏ(నాన్ పెర్ఫార్మింగ్ అలియన్స్)గా అభివర్ణిస్తున్న కేటీఆర్.. ఎన్‌పీఏ ప్రభుత్వం అద్భుతమైన ప్రదర్శన అంటూ ఎద్దేవా చేశారు.
ఇక, ఇటీవలపెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడానికి రాష్ట్రాలే కారణమని ప్రధాని మోదీ (narendra modi) చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కేంద్రం పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సెస్‌లు కారణం కాదా..? అని ప్రశ్నించారు. కేంద్రంలోని ఎన్పీఏ ప్రభుత్వం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తాము వ్యాట్ పెంచలేదన్నారు. తాము వ్యాట్ ను పెంచకపోయినప్పటికీ రాష్ట్రం పేరును లేవనెత్తడమే మీరు మాట్లాడే కోఆపరేటివ్ ఫెడరలిజమా? అని ప్రశ్నించారు.
2014 నుంచి తెలంగాణలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను పెంచలేదని చెప్పారు. మీరు వసూలు చేస్తున్న సెస్ లో చట్టబద్ధంగా తమకు రావాల్సిన 41 శాతం వాటా రావడం లేదని కేటీఆర్ విమర్శించారు. సెస్ పేరుతో మీరు రాష్ట్రం నుంచి 11.4 శాతం వాటాను లూటీ చేస్తున్నారని అన్నారు. సెస్ ను రద్దు చేస్తే దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 70కి, డీజిల్ ధర రూ. 60కి వస్తుందని చెప్పారు.
