జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌, టీడీపీలపై విరుచుకుపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రచారంలో భాగంగా మీర్‌పేట్‌ హౌసింగ్‌బోర్డు కాలనీలో పలు సమావేశాలు, ర్యాలీలు జరిగాయి.

హౌసింగ్‌బోర్డు కాలనీలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం దర్జీ, కుర్మ సంఘం, వెంకటేశ్వరానగర్‌లో ముదిరాజ్‌ సంఘం ఆత్మీయ సమావేశంలో ఎర్రబెల్లి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ , కేటీఆర్‌లు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. అతి త్వరలో ఉప్పల్‌ నియోజక వర్గం పరిధిలో కొత్తగా 5 ఐటీ పార్కులకు శంకుస్ధాపన చేయనున్నట్టు మంత్రి తెలిపారు.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. కేవలం ఎన్నికల సమయంలో ప్రజల ఓట్లతో గెలవాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌, టీడీపీలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కానీ టీఆర్‌ఎస్‌ మాత్రం ఎన్నికలకు సంబంధం లేకుండా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని దయాకర్ రావు స్పష్టం చేశారు.