గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు‌గా పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యేలు పార్టీ బలంతో కాకుండా సొంత ఇమేజ్ తో మాత్రమే గెలిచారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగినప్పటికి అక్కడక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందడానికి కారణమదేనని తెలిపారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు, సూచనలను అనుసరించి టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారని అన్నారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలు తమ నాయకులు టిఆర్ఎస్ లో చేరాలని కోరుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో మంత్రి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో దాదాపు 500మంది స్థానిక ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్
లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక కనుమరుగడం ఖాయమన్నారు. 

రోజుకో ఎమ్మెల్యే పార్టీని వీడుతుంటే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోనే కాదు డిల్లీలోని అదిష్టానం కూడా వణికిపోతోందన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రారంభించిన ఈ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు దీనిపై విమర్శలు చేయడం విడ్డూరంగా వుందన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఎన్నికలంటే ఎప్పుడూ భయం లేదని... అవసరమైతే ఇటీవల పార్టీలో చేరిన, చేరుతున్న ఎమ్మెల్యేలు రాజీనామాకైనా సిద్దంగా ఉంటారని మంత్రి వెల్లడించారు. 

రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో 16 చోట్లు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు.  ఇలా
మంచి మెజారిటీ అందిస్తే టీఆర్ఎస్ కేంద్రంలో ప్రత్యేక పాత్ర పోషించనుందన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో ఇప్పుడున్న జాతీయ పార్టీలకు సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం లేదు... కాబట్టి ప్రాంతీయ పార్టీల పాత్న కీలకం కానుందని పేర్కొన్నారు. అలాంటి సమయంలో ఇప్పటికే ఫెడరల్ ప్రంట్ పేరుతో వివిధ ప్రాంతీయ పార్టీలతో సంప్రదించిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నారని మంత్రి ఎర్రబెల్లి జోస్యం చెప్పారు.