వరంగల్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బీజేపీ అధికారంలో వున్న రాష్ట్రాల్లో ఇస్తున్న పథకాలు, తెలంగాణలో అమలవుతోన్న పథకాలను ప్రజలకు వివరిద్దామన్నారు.
నిన్న వరంగల్‌లో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆదివారం హన్మకొండ జిల్లా పరకాలలో జరిగిన తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ పరకాల ప్రాజెక్ట్ మహాసభకు ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో వున్న రాష్ట్రాల్లో ఇస్తున్న పథకాలు, తెలంగాణలో అమలవుతోన్న పథకాలను ప్రజలకు వివరిద్దామన్నారు. ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటే మీకు పాదాభివందనం చేస్తానని.. ఒకవేళ మమ్మల్ని మెచ్చుకుంటే మీరేం చేస్తారంటూ ఎర్రబెల్లి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. బీజేపీ అధికారంలో వున్న రాష్ట్రాల్లో అంగన్‌వాడీలకు రూ.7 వేలే వేతనంగా ఇస్తున్నారని.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.13,650 ఇస్తుందని దయాకర్ రావు చురకలు వేశారు.
ఇకపోతే.. ఆదివారం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బీజేపీవి అన్ని అబద్ధాలు, జూటా మాటలని దుయ్యబట్టారు. కిషన్ రెడ్డి తనతో వరంగల్‌కు వస్తే ఆసుపత్రి పనులు చూపిస్తానని హరీశ్ రావు సవాల్ విసిరారు. కేంద్రం వాటా తెలంగాణలో ఒక్క పైసా కూడా లేదని.. జేపీ నడ్డా అన్ని అబద్ధాలే చెప్పారని మంత్రి ఆరోపించారు. గుజరాత్, మహారాష్ట్రలలో ఎందుకు పెన్షన్లు ఇవ్వడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. పోరాటాల గడ్డపై నడ్డా అబద్ధాలు మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు.. నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందన్నారు. రోడ్ల కోసం మొత్తం రూ. 20 వేల కోట్లకు పైగా కేంద్రం ఖర్చు చేస్తుందని చెప్పారు.యాదాద్రి నుంచి వరంగల్‌కు రూ. 388 కోట్లతో రోడ్డు నిర్మించిందని చెప్పారు. జగిత్యాల నుంచి కరీంనగర్ రోడ్డుకు రూ. 4 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నామని చెప్పారు. వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం రూ. 196 కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఇది నిజం కాదా..? అని కేసీఆర్ సర్కార్‌ను ప్రశ్నించారు.
ALso REad:నడ్డావన్నీ అబద్ధాలే... కిషన్ రెడ్డి నాతో వరంగల్ వస్తే అభివృద్ధి చూపిస్తా : హరీశ్ రావు సవాల్
వరంగల్‌లో కుర్చీ వేసుకుని కూర్చుని అభివృద్ది చేస్తానని కేసీఆర్ అన్నారని.. కానీ కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ను వీడింది లేదని, వరంగల్‌లో అభివృద్ది చేసింది లేదన్నారు. వరంగల్ అభివృద్దికి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఏమైందో అందరికీ తెలుసని అన్నారు.
రామప్ప ఆలయానికి కేంద్రం యూనెస్కో గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు. రామప్ప ఆలయం అభివృద్దికి రూ. 60 కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. వేయి స్తంభాల గుడి అభివృద్దికి కూడా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. వరంగల్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్ మంజూరు చేసిందన్నారు. కానీ సైనిక్ స్కూల్ నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం భూమి కేటాయించడం లేదని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ కోసం భూమి కేటాయించడం లేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు.
