వరంగల్: వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. గతంలో వరంగల్ అభివృద్ధిపై ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికార టీఆర్‌ఎస్‌ నెరవేర్చలేకపోయిందన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తనదైన శైలిలో కౌంటరిచ్చారు.

''కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి అర్థరహితంగా మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లడానికే అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. టీఆర్ఎస్ ను వరంగల్ కార్పోరేషన్ లో మళ్లీ గెలిపించినా ఫలితం వుండదని రేవంత్ అంటున్నాడు. కానీ కేవలం వచ్చే ఆరు నెలల్లోనే టెక్స్‌టైల్‌ పార్క్ పనులు ప్రారంభిస్తాం. ఒకవేళ ఆరు నెలల్లో పనులను ప్రారంభించకపోతే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా'' అంటూ ఎర్రబెల్లి ఛాలెంజ్ చేశారు. 

ఇక వరంగల్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సుముఖంగా వుందని... అందుకోసం భూమిని కూడా ఇప్పటికే మంజూరు చేశామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం  యూనివర్సిటీని మంజూరు చేయడంలేదని ఎర్రబెల్లి తెలిపారు. 

వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల విజయం ఖాయమన్నారు. ఈ విజయం తర్వాత వరంగల్ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి సూచించారు.