హైదరాబాద్:  భారతదేశంలో ఎక్కడినుండైనా పోటీ చేసి తాను విజయం సాధిస్తానని  ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ధీమాను వ్యక్తం చేశారు..  తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్ పై కూడ ఆయన వదల్లేదు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.టీఆర్ఎస్ కు చెందిన వారు సులభంగా పార్టీలు మారుతారని వ్యాఖ్యానించారు. 

పార్టీలు మారేవారిని కేసీఆర్, కేటీఆర్‌లు కంట్రోల్ చేయడం లేదన్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానంలో కేసీఆర్ తన కూతురును కూడ ఎంపీగా గెలిపించుకోలేకపోయారని అక్బరుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడ ఇటీవల ఎంఐఎం నేతలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ పై విరుచుకుపడ్డారు.తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది.

ఎన్ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని ఈ రెండు పార్టీలు భావించాయి. ఇటీవల ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో సుధీర్ఘంగా చర్చించారు. ఈ రెండు అంశాలపై దేశ వ్యాప్తంగా ఇతర పార్టీలతో కలిసి కార్యాచరణను చేపట్టాలని నిర్ణయం తీసుకొన్నాయి.

అయితే ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎంఐఎం విమర్శలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.