ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామనే ముసుగులో ఎంఐఎం వ్యాపారాలు చేస్తోంది - ఫిరోజ్ ఖాన్
అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ (AIMIM MLA Akbaruddin Owaisi), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth reddy) మధ్య జరిగిన మాటల యుద్ధంపై కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ (Congress Leader Feroz Khan) స్పందించారు. అక్బరుద్దీన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. విద్యుత్ పై చర్చ సమయంలో ఒకరికొకరు ధీటుగా సమాధానాలు ఇచ్చుకున్నారు. అయితే దీనిపై తాజాగా కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ స్పందించారు. ఒవైసీపై సంచలన ఆరోపణలు చేశారు.
ఏఐఎంఐఎం, అక్బరుద్దీన్ ఒవైసీలు ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామనే ముసుగులో వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం ఏనాడు కేసీఆర్ ను ప్రశ్నించలేదని అన్నారు. ఇక పాతబస్తీ అభివృద్ధిని కాంగ్రెస్ చూసుకుంటుందని అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం తన ‘ఎక్స్’ హ్యాండిల్ లో పోస్టు పెట్టారు. ‘‘అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్ ఓవైసీకి ధీటుగా బదులిచ్చారు. అక్బర్ వినండి.. మీరు, మీ పార్టీ ముస్లింల పేరుతో వ్యాపారం చేస్తోంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ మైనార్టీ సమస్యలపై కేసీఆర్ ను మీరు ప్రశ్నించలేదు. ఇప్పుడు మీ సమయం అయిపోయింది. ఇక పాత పాతబస్తీ అభివృద్ధిపై పాత బస్తీ దృష్టి సారిస్తుంది.’’ అని చెప్పారు.
ఇంధన రంగంపై అసెంబ్లీ గురువారం చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ కె.సత్యనారాయణ పరస్పరం వాదించుకున్నారు. ఈ ఘర్షణ తీవ్రమైంది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఒవైసీ వ్యాఖ్యల చేశారు. దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని అక్బరుద్దీన్ ఓవైసీ ప్రస్తావించడంతో చర్చ తీవ్రరూపం దాల్చింది.
దీంతో గతంలో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్.భాస్కర్ రావుకు ఎంఐఎం మద్దతు ఇచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ దుర్మార్గపు పాలన సాగిస్తున్నప్పటికీ ఎంఐఎం దాన్ని సమర్థించడాన్ని ఆయన తప్పుబట్టారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.