తెలంగాణ శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎంపిక నేపథ్యంలో ఎంఐఎం అధినేత , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 14న ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.
ఎంఐఎం (mim) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) శనివారం అసెంబ్లీకి వచ్చారు. మండలి ఛైర్మన్ (telangana council chairman) , డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో అసద్ చర్చించారు. మండలి డిప్యూటీ ఛైర్మన్, విప్ పదవి కోసం అసద్ సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. పదవుల గురించి చర్చించలేదని.. నియోజకవర్గం అభివృద్ధి కోసమే కేటీఆర్‌ను కలిశానని అసదుద్దీన్ పేర్కొన్నారు. యూపీ ఫలితాల ప్రభావం ఇక్కడ వుండదన్నారు.
కాగా.. శనివారం తెలంగాణ శాసనమండలి (telangana legislative council) చైర్మన్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 14న చైర్మన్ ఎన్నిక జరుగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. గతేడాది జూన్‌లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (gutta sukender reddy) , వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ల (nethi vidyasagar) ఎమ్మెల్సీ సభ్యత్వ కాలం నేటితో ముగిసింది.
దీంతో ప్రోటెం చైర్మన్‌గా మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు. అయితే భూపాల్ రెడ్డి పదవీకాలం కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎంఐఎం సభ్యుడు సయ్యద్ ఖాద్రీ మండలి ప్రొటెం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలిలోని ఖాళీలన్నీ భర్తీకావడంతో తాజాగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ప్రకటన వెలువడింది. కొత్త ఛైర్మన్ ఎంపికకు సంబంధించి గవర్నర్ కు సమాచారం ఇచ్చిన మండలి అధికారులు..నూతన ఛైర్మన్ ఎంపికకు సంబంధించి అనుమతి తీసుకున్నారు. అయితే, అధికార పార్టీకి మండలిలో మెజార్టీ ఉండటంతో ఎవరికి మండలి ఛైర్మన్ - డిప్యూటీ ఛైర్మన్ గా అవకాశం ఇస్తారనే అంశంపైన చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (kcr) సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసారు. దీంతో గుత్తాకే మరోమారు కౌన్సిల్ చైర్మన్‌గా సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రేపు గుత్తా నామినేషన్ వేయనున్నారు. గతంలో మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సుఖేందర్ రెడ్డి... ఇటీవల శాసనసభ కోటా నుంచి మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు
