వలస కూలీలతో వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురయిన విషాద సంఘటన నిర్మల్ జిల్లాలో  చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో లారీలో 70మంది వలసకూలీలు వుండగా 20మందికి గాయాలయ్యాయి. వారిలో 9మందికి తీవ్రగాయాలయ్యాయి. మిగతావారందరు చిన్న చిన్న గాయాలతో ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ ప్రాంతానికి చెందిన కొందరు కూలీలు ఉపాధి నిమిత్తం తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ లో కూలీ పనులు చేసుకుంటున్న వారికి లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకుండా పోయింది. దీంతో తమ స్వస్థలానికి వెళ్లాలని భావించిన వారు ఓ లారీలో బయలుదేరారు. 

హైదరాబాద్ నుండి కూలీలతో బయలుదేరిన లారీ నిర్మల్ జిల్లా భాగ్యనగర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. జాతీయ రహదారిపై వేగంగా వెళుతూ అదుపుతప్పిన లారీ రెయిలింగ్ ను ఢీకొట్టింది. దీంతో కొందరు కూలీలు తీవ్రంగా గాయపడగా చాలామంది చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా  బయటపడ్డారు. 

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను నిర్మల్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అందులో ఇద్దరి పరిస్థతి విషమంగా వుండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం  ఏడుగురు నిర్మల్ హాస్పిటల్లో, ఇద్దరు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. 

ఈ దుర్ఘటనపై సమాచారం తెలియగానే స్థానిక జిల్లా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించారు.   క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ వారిని గోర‌ఖ్ పూర్ కు త‌ర‌లించేందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు మంత్రి ఆదేశించారు.