హైదరాబాద్ వాసులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అమీర్‌పేట్-హైటెక్ సిటీ మెట్రో మార్గం మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి  రానుంది. ఈ మార్గంలో ఇప్పటికే ట్రయల్ రన్ లో భాగంగా ప్రస్తుతం మెట్రో  ఖాళీగా పరుగులు పెడుతుండగా త్వరలో ప్రయాణికులతో పరుగులు పెట్టనుంది. ఈ మేరకు ఈ మార్గానికి  ​కమీషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సిఎంఆర్ఎస్) నుంచి అనుమతి లభించిందని మెట్రో రైల్ ఎండి ఎన్.వి.ఎస్.రెడ్డి వెల్లడించారు. ఇలా ఇప్పటికే అన్ని అనుమతులు లభించాయని... అతిత్వరలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రెడ్డి ప్రకటించారు.

ఈ మార్గంలో మెట్రో అందుబాటులోకి వస్తే సాప్ట్ వేర్ ఉద్యోగులకు ఎంతో అనుకూలంగా వుండనుంది. అందువల్ల చాలా రోజులుగా వారు ఈ మార్గంలో మెట్రో మార్గం ఎప్పుడు  అందుబాటులోకి వస్తుందా అని వారు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో నివాసముంటూ హైటెక్ సిటి, మాదాపూర్,  జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని కార్యాలయలకుమ వెళ్లే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నిత్యం రద్దీతో, ట్రాపిక్ జామ్ లతో గందరగోళంగా వుండే బంజారాహిల్స్ ప్రాంతంలోని కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ మెట్రో రాకతో కాస్త ఊరట లభించనుంది. 

అయితే మరో రెండు నెలల పాటు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో వుండనున్న నేపథ్యంలో ఈ మార్గంలో మెట్రోని ఎలాంటి హడావుడి లేకుండా ప్రారంభించనున్నారు. అందుకోసం మెట్రో సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. 

అమీర్ పేట నుండి  హైటెక్ సిటి వరకు 10 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 10 స్టేషన్లు వున్నాయి. అమీర్ పేట, మధురానగర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5,  జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ స్టేషన్లున్నాయి. ఇలా నగరంలోని ప్రముఖ ప్రాంతాలను ఈ మెట్రో రాక ద్వారా రవాణా సదుపాయం మెరుగుపడనుంది.