Asianet News TeluguAsianet News Telugu

ప్రతిరోజూ మూడు లక్షల మందికి వ్యాక్సిన్... తెలంగాణలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం

ప్రతి రోజూ మూడు లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. 

mega vaccination drive starts in telangana
Author
Hyderabad, First Published Sep 16, 2021, 10:54 AM IST

హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా గురువారం నుండి మెగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. కరోనాను తరిమికొట్టడానికి చేపట్టే ఈ మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ స‌భ్యులు, జడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు స్వచ్చంద సంస్థలు భాగస్వాములై విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

వరంగల్ జిల్లా నుండి ఈ మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెర్కవేడుతో పాటు జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు, లింగాల ఘనపూర్ మండలం నవాబ్ పేట గ్రామంలో  స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తో కలిసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా నివారణ వాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కెసిఆర్ తీసుకుంటున్న చర్యల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నుండి తెలంగాణ ప్రజలను కాపాడటానికి ప్రతిరోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు.

read more  తెలంగాణ: కొత్తగా 324 మందికి పాజిటివ్.. 6,62,526కి చేరిన కేసుల సంఖ్య

''ప్రస్తుతం రాష్ట్రంలో  కరోనా పూర్తి నియంత్రణ లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాల పైబడిన వారు 2 కోట్ల 80 లక్షల మంది ఉన్నారు. ఇప్పటి వరకు రెండు కోట్ల 17 వేలమందికి వాక్సిన్ ఇచ్చాం. వీరిలో ఒక కోటి 45 లక్షల మందికి  మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. 55 లక్షల మందికి సెకండ్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది'' అని వివరాలు తెలిపారు.

''పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి స్పూర్తితో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతా కలిసి కలిసికట్టుగా, సమన్వయంతో కరోనా వ్యాక్సినేషన్ ని విజయవంతం చేయాలి. గ్రామాలు, వార్డుల వారీగా ప్రణాళిక బద్దంగా 100% వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. తహసిల్దారు, ఎంపిడిఓ, మెడికల్ ఆఫీసర్ మండల స్థాయిలో సమన్వయం చేసుకోవాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో బాగా పనిచేసిన వారికి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అవార్డులు అందజేస్తాం'' అని మంత్రి ప్రకటించారు. 

''అన్ని గ్రామాలు, పట్టణాలలో ఇంటింటికి ఆశా, అంగన్వాడీ, స్థానిక సంస్థల సిబ్బంది వెళ్లి రెడీ చేసిన వాక్సిన్ తీసుకోనివారి జాబితా సిద్ధంగా ఉంది. గుర్తించిన వారికి వాక్సిన్ ఇచ్చి, ఆ ఇంటి కి వాక్సిన్ కు సంబంధించిన స్టిక్కర్ వేయాలి. ప్రతీ మున్సిపాలిటీకి, మండలానికి వాక్సినేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్ ను నియంనించాం. అందరూ భాగస్వాములై నూటికి నూరు శాతం కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'' అని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios