తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఊహించని విధంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో నగరంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

కరోనా వైరస్‌ నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తామని స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించడంతో ఆ ప్రచారం ఊపందుకుంది. లాక్‌డౌన్‌కు అందరినీ సిద్ధం చేయాలంటూ ఉన్నతస్థాయి సమావేశంలో ఇటీవల కేసీఆర్ పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం అనేది ప్రభుత్వాలు చేస్తున్న చారిత్రాత్మక తప్పిదం అవుతుంది అన్నారు మెగా బ్రదర్ నాగబాబు. దీనిపై ఆయన ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘‘రీసెంట్‌గా నేను వింటున్న వార్తలను బట్టి నాకు అర్ధమైంది ఏంటంటే మళ్ళీ లాక్‌డౌన్ పెట్టాలనే ఆలోచన ఉంది ప్రభుత్వానికి అని. కొన్ని చోట్ల లాక్‌డౌన్ పెట్టి.. మరికొన్ని చోట్ల సడలింపులు ఉంటాయనే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. లాక్‌డౌన్ విధించమని కొంతమంది అడుగుతున్నారని బయటికొస్తుంది. ఇక్కడ నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే... అసలు లాక్‌డౌన్ పర్పస్ ఏంటి? కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయడం, రెండోది ఈ గ్యాప్‌లో 60 నుంచి 90 రోజులు చేసిన లాక్‌డౌన్‌లో మెడికల్ రీ-సోర్సెస్‌ని అన్ని రకాలుగా సమకూర్చుకుని, ప్రజలలో ఎవరికైనా కరోనా వస్తే వారికి సరైన వైద్యం చేయించడానికి సరిపోయేటటువంటి శక్తులన్నీ సమీకరించుకోవడానికి లాక్‌డౌన్ విధించినట్లుగా నేను అనుకున్నాను.’’ అని అన్నారు.

 ‘‘ప్రభుత్వాలు ఇంచు మించు 60 నుంచి 90 రోజులు పాటు లాక్‌డౌన్ విధించాయి. వెరీ గుడ్. ఈలోపుగా అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ మీరు రీ-సోర్స్‌ని కూడదీసుకుని ఇప్పుడు మీరు ఏట్లా ఉండాలంటే.. ప్రజలందరూ 90 రోజులు పాటు వారి జీవితాల్ని వదిలేశారు. అందరూ ఎంత నష్టపోయారో మనకు తెలుసు. వలస కార్మికుల కష్టాలైతే మనం చెప్పలేమసలు. ఇక మన మీద డిపెండ్ అయినటువంటి నోరు లేని జీవులు కూడా చాలా దారుణంగా సఫర్ అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడదాం. ఇంత గ్యాప్‌లో అన్నీ సమకూర్చుకుని ఇప్పుడు ప్రభుత్వాలు ఈ మహమ్మారిపై యుద్ధం చేయాలి. అలా కాకుండా మళ్లీ లాక్‌డౌన్ పెట్టి, జనజీవనాన్ని స్థంబింపజేయడం అనే ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. లాక్‌డౌన్ విధించారంటే మాత్రం ఏ గవర్నమెంట్ అయినా (స్టేట్ ఆర్ సెంట్రల్) చారిత్రాత్మక తప్పిదం అవుతుంది. చాలా దేశాలు లాక్‌డౌన్ లేకుండా కూడా మహమ్మారిని ఎదుర్కొంటూ దేశాన్ని సక్సెస్‌పుల్‌గా నడిపిస్తున్నాయి. ఓకే..మన దేశం చాలా పెద్ద దేశం. జనాభా కూడా ఎక్కువ. అందుకే ఇన్ని రోజులు లాక్‌డౌన్ విధించారు. కానీ ఇప్పుడు లాక్‌డౌన్ అంటే మాత్రం స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ చారిత్రాత్మక తప్పిదం చేసినట్లే..’’ అని నాగబాబు ఈ వీడియోలో పేర్కొన్నారు.