ఒకప్పుడు తినడానికి తిండి, సరైన సదుపాయాలు లేక అవస్థలు పడిన వ్యక్తి.. ఇప్పడు రోజూ 300 నుంచి 400మంది ఆకలి బాధను తీరుస్తున్నారు. ఆయనే అజహర్ మక్సూసీ. హైదరాబాద్ లోని గాంధీ జనరల్ హాస్పిటల్ , దబీర్ పుర ప్రాంతంలో అజహర్.. రోజూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇలా ఒకరి ఆకలి బాధను తీర్చాలన్న ఆలోచన తనకు ఎలా కలిగిందో స్వయంగా వివరించాడు అజహర్. మరి ఆయన ఇంత గొప్ప ఆలోచనకు అంకురార్పణ ఎలా జరిగిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందామా..

‘‘ నా చిన్నతనంలో కనీసం మూడుపూటలా తిండి తినక నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నాకు నాలుగేళ్ల వయసులోనే మా నాన్న చనిపోయారు. నాన్నను కోల్పోయిన దగ్గర నుంచి ఎన్నో సార్లు నేను, నా కుటుంబం ఆకలితో గడిపిన రోజులు ఉన్నాయి.  ఆ తర్వాత  కొన్నాళ్లకు నేను ఉద్యోగం సాధించగలిగాను.  ఒకరోజు ఆకలితో బాధపడుతున్న ఓ మహిళను చూశాను. వెంటనే నా దగ్గర ఉన్న డబ్బులతో ఆమెకు ఆహారాన్ని కొని అందజేశాను. ఆ రోజే నేను దేవుడిని ప్రారంభించాను. ఇలా ఇంకొందరి ఆకలి బాధ తీర్చేలా నాకు ఒక మార్గాన్ని చూపించాలని’’ అని అజహర్ తెలిపారు.

‘‘ దబీర్ పుర ప్రాంతంలో గత ఏడు సంవత్సరాలుగా నేను పేదలకు ఆహారాన్ని అందిస్తున్నాను. నా  సొంత డబ్బులతో వారికి రోజూ ఆహారాన్ని అందిస్తూ వచ్చాను. కాగా.. నా గురించి తెలిసిన కొందరు.. గత  మూడు సంవత్సరాల నుంచి పేదలకు ఆహారాన్ని అందించడానికి సరకులు సహాయం చేయడం మొదలుపెట్టారు. దీంతో.. అప్పటి వరకు కేవలం దబీర్ పుర ప్రాంతంలో మాత్రమే అందించేవాడిని కాస్త.. గాంధీ హాస్పిటల్ వద్ద పేదలకు కూడా ఆహారం అందించడం ప్రారంభించాను. ప్రస్తుతం రోజుకి 300 నుంచి 400మంది కి ఆహారం అందిస్తున్నాను’’ అని చెప్పారు.

కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా బెంగళూరు, రాయ్ చూర్, అస్సాం, జార్ఖండ్ లోని నిరుపేదలకు కూడా ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్లు అజహర్ చెప్పారు. ప్రతి రోజూ ఈ రాష్ట్రాల్లో ని దాదాపు వెయ్యి నుంచి 1200మంది పేదలకు భోజనం అందిస్తున్నట్లు వివరించారు.

 ఈ కార్యక్రమంలో పై ఓ రోజూ కూలీ మాట్లాడుతూ.. తాను సంతవ్సరం నుంచి ఇక్కడ భోజనం చేస్తున్నట్లు వివరించాడు. పని దొరకని రోజు తనకు తినడానికి తిండి ఉండదని అప్పుడు ఇక్కడకు వచ్చి భోజనం చేస్తానని తెలిపాడు.