దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల సాయంతో ఔషధాల పంపిణీకి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. వికారాబాద్ జిల్లాలో ఎలాంటి రవాణా సదుపాయాలు లేని మూరుమూల అటవీ ప్రాంతాలకు డ్రోన్ల సాయంతో మందులను తరలించనున్నారు. ఈ పథకానికి 'మెడిసిన్ ఫ్రమ్ స్కై' అని పేరుపెట్టారు.
ప్రస్తుత కాలంలో డ్రోన్ల వినియోగం అన్ని రంగాల్లోనూ విస్తరిస్తోంది. ఇటీవల జమ్మూ వాయుసేన స్థావరంపై డ్రోన్ల దాడితో భారత్ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల సాయంతో ఔషధాల పంపిణీకి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. వికారాబాద్ జిల్లాలో ఎలాంటి రవాణా సదుపాయాలు లేని మూరుమూల అటవీ ప్రాంతాలకు డ్రోన్ల సాయంతో మందులను తరలించనున్నారు. ఈ పథకానికి 'మెడిసిన్ ఫ్రమ్ స్కై' అని పేరుపెట్టారు.
శనివారం వికారాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ 'మెడిసిన్ ఫ్రమ్ స్కై' పథకాన్ని ప్రారంభించారు. మందులు ఉన్న బాక్సును సింథియా డ్రోన్ లో ఉంచి ప్రారంభోత్సవం చేశారు. మొత్తం మూడు డ్రోన్లలో మందులు ఉంచి వికారాబాద్ రీజనల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అయింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, టెక్నాలజీ వినియోగాన్ని సీఎం కేసీఆర్ ఎంతో ప్రోత్సహిస్తుంటారని వెల్లడించారు. టెక్నాలజీ ప్రధానంగా సామాన్యుడికి ఉపయోగపడాలన్నది ఆయన ఆకాంక్ష అని తెలిపారు. డ్రోన్ల ద్వారా మందులే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో రక్తం కూడా తరలిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ 'మెడిసిన్ ఫ్రమ్ స్కై' ప్రాజెక్టులో గ్లోబల్ ఎకనామిక్ ఫోరం, నీతి ఆయోగ్, హెల్త్ నెట్ గ్లోబల్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పటికే డ్రోన్ల సరఫరాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది
